Ardha Halasana : యోగాలో మనకు చేసేందుకు అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఆసనం భిన్న రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. అందువల్లనే రోజూ మన శరీరానికి అవసరం అయ్యే ఆసనాలను వేయాలని వైద్యులు చెబుతుంటారు. కొందరికి కొన్ని ఆసనాలు వేయడం అవసరం ఉండదు. కొన్ని ఆసనాలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. కనుక మన శరీర తత్వం, వ్యాధులు వంటి అంశాల కారణంగా మనం చేయాల్సిన ఆసనాలను మనమే ఎంచుకుని వాటిని రోజూ వేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. మనకు ఉండే వ్యాధులు తగ్గుతాయి. ఇక అలా రోజూ వేయదగిన ఆసనాల్లో ఒకటి.. అర్ధ హలాసనం.
అర్ధ హలాసనం వేయడం ఆరంభంలో కొంత కష్టమే అవుతుంది. కానీ రోజూ ప్రాక్టీస్ చేస్తే దీన్ని చక్కగా వేయగలుగుతారు. ఇక ఆరంభంలో ఈ ఆసనాన్ని వేసేందుకు అవసరం అయితే గోడ సపోర్ట్ తీసుకోవచ్చు. తరువాత గోడ లేకుండానే కాళ్లను నేరుగా పైకి పెట్టాల్సి ఉంటుంది. నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లను ఒకదాని తరువాత ఒకటి పైకి లేపి 90 డిగ్రీల కోణంలో పెట్టాలి. ఇలా రెండు కాళ్లను ఉంచిన తరువాత ఈ భంగిమలో కనీసం 10 నిమిషాలు అయినా ఉండాలి. ఆరంభంలో ఇలా 10 నిమిషాల పాటు ఉండడం కష్టమే అవుతుంది. కానీ ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది. ఫలితంగా ఈ ఆసనాన్ని రోజూ 20 నిమిషాల పాటు కూడా వేయవచ్చు. ఇక ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
అర్ధ హలాసనాన్ని వేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగు పడుతుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా మారుతుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. దీంతోపాటు ఒత్తిడి మొత్తం తగ్గుతుంది కనుక నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇక ఈ ఆసనాన్ని వేయడం వల్ల శరరీంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
ఇక ఈ ఆసనాన్ని వేయడం వల్ల పొట్ట దగ్గర ఉండే కండరాలు, తొడ కండరాలు దృఢంగా మారుతాయి. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. పొట్ట, నడుము, తొడల వద్ద ఉండే కొవ్వు కరుగుతుంది. చక్కని శరీరాకృతిని పొందుతారు. దీంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణసమస్యలైన అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటివి తగ్గిపోతాయి. ఇలా ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.