Paneer Making : ప్రతి రోజూ పాలను తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పాలను తాగడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలను తాగడం వల్ల విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి కూడా పాలు దోహదపడతాయి.
పాలను ఉపయోగించి మనం వివిధ రకాల పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేసే వాటిలో పన్నీర్ ఒకటి. పన్నీర్ తో మనం ఎంతో రుచిగా రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. పన్నీర్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా పాలను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందవచ్చు. పన్నీర్ మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దీని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే చాలా సులువుగా పాలను ఉపయోగించి బయట దొరికే పన్నీర్ లాగానే మనం ఇంట్లోనూ దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పన్నీర్ ను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక లీటర్ చిక్కని పాలను తీసుకుని స్టవ్ మీద ఉంచి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై మరిగించాలి. పాలు మరిగిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత పాలు విరుగుతాయి. ఇప్పుడు మంటను పెద్దగా చేసి 3 నిమిషాల పాటు ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పెద్దగా ఉండే జల్లి గంటను ఉంచి దానిలో శుభ్రమైన వస్త్రాన్ని ఉంచి విరిగించిన పాల మిశ్రమాన్ని పోయాలి. ఇలా చేయడం వల్ల నీరు అంతా పోతుంది. అదే వస్త్రంలో మిగిలి ఉన్న పాల మిశ్రమాన్ని రెండు సార్లు మంచి నీటితో కడిగి నీరు లేకుండా చేత్తో పిండాలి.
తరువాత సమానంగా ఉండే చెక్క, పీట లేదా గిన్నె వంటి వాటిపై పాల మిశ్రమం ఉంచిన వస్త్రాన్ని ఉంచి సమానంగా చేసుకోవాలి. దీనిపై బరువుగా ఉండే రోలు లేదా ఇతర వస్తువులను ఉంచి 2 నుండి 3 మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల నీరు అంతా పోయి మెత్తగా ఉండే పన్నీర్ తయారవుతుంది. 3 గంటల తరువాత బరువును తొలగించి పన్నీర్ ను కావల్సిన పరిమాణంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పన్నీర్ కూడా బయట దొరికే పన్నీర్ లా ఉంటుంది. దీనిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవడం వల్ల 2 వారాల వరకు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ తో రకరకాల వంటలను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.