Gongura Pulihora : గోంగూర‌తో చేసే పులిహోర‌ను ఎప్పుడైనా తిన్నారా ? రుచి అదిరిపోతుంది..!

Gongura Pulihora : మ‌నం వంటింట్లో త‌ర‌చూ పులిహోర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం ఎక్కువ‌గా చింత‌పండు, నిమ్మ‌కాయ‌లతో పాటుగా అప్ప‌డ‌ప్పుడు మామిడికాయ‌ల‌తో కూడా పులిహోర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పులిహోర రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. అయితే వీటితో మాత్ర‌మే కాకుండా గోంగూర‌తో కూడా పులిహోర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూరతో చేసే పులిహోర కూడా చాలా రుచిగా ఉంటుంది. గోంగూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డిని, పప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటితోపాటు గోంగూర‌తో పులిహోర‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర పులిహోర‌ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

have you ever tasted Gongura Pulihora its very delicious
Gongura Pulihora

గోంగూర పులిహోర తయారీకి కావ‌ల్సిన పదార్థాలు..

అన్నం – పావు కిలో బియ్యంతో ఉడికించినంత‌, గోంగూర – ఒక క‌ట్ట (పెద్ద‌ది), శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిర‌ప కాయ‌లు – 5 లేదా 6, నూనె – ఒక టీ స్పూన్.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, జీడి ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 4, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు- రుచికి త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

గోంగూర పులిహోర త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో శ‌న‌గ‌ప‌ప్పు, ధ‌నియాలు, ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక నువ్వులను వేసి వేయించి చ‌ల్లారిన త‌రువాత జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి కాగాక గోంగూర‌ను వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక ప‌ల్లీలు, జీడి ప‌ప్పును వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర‌తోపాటు పొడిగా చేసుకున్న మిశ్ర‌మం, ప‌సుపు, రుచికి స‌రిప‌డా ఉప్పును వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన దాని నుండి కొద్ది ప‌రిమాణంలో గోంగూర‌ను తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి.

ఇప్పుడు అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత రుచి చూసి పులుపు త‌క్కువ‌గా ఉంటే ప‌క్క‌కు ఉంచిన గోంగూర మిశ్ర‌మాన్నివేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట‌పై 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ముందుగా వేయించిన ప‌ల్లీలు, జీడిప‌ప్పుతోపాటు త‌రిగిన కొత్తిమీర‌ను వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పులిహోర త‌యార‌వుతుంది.

త‌ర‌చూ చేసుకునే చింత‌పండు పులిహోర‌కు బ‌దులుగా అప్పుడ‌ప్పుడూ ఇలా గోంగూర‌తో పులిహోర‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డ‌మే కాకుండా గోంగూర వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గోంగూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. గోంగూర‌లో ఐర‌న్, విట‌మిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను నియంత్రించ‌డంతోపాటు కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, రక్తహీన‌త‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో.. గోంగూర ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.

D

Recent Posts