Ragi Halwa : చిరు ధాన్యాల్లో ఒకటైన రాగులతో మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగుల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో వేడి మొత్తం తగ్గిపోతుంది. దీంతో శరీరం చల్లగా మారి వేసవి తాపం తగ్గుతుంది. అయితే రాగులను పలు రకాలుగా మనం తీసుకోవచ్చు. వాటిల్లో రాగి హల్వా ఒకటి. దీన్ని సరిగ్గా చేయాలే గానీ ఎంతైనా అవలీలగా తినేస్తారు. దీంతో మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక రాగి హల్వాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – 2 కప్పులు, నీళ్లు -2 కప్పులు, రాగి రవ్వ – ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం – అర కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు -2 టేబుల్ స్పూన్లు, పిస్తా – 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – 2 టీస్పూన్లు.
రాగి హల్వాను తయారు చేసే విధానం..
పాలలో నీళ్లు పోసి బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి కరగబెట్టాలి. నెయ్యి మొత్తం కరిగాక అందులో రాగి రవ్వ వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమం బంగారు వర్ణంలోకి వచ్చే వరకు అలాగే గరిటెతో తిప్పుతూ ఉడకబెట్టాలి. తరువాత అందులో ముందుగా మరిగించిన పాలను పోసి బాగా తిప్పాలి. అందులోనే చక్కెర లేదా బెల్లం పొడి వేసి మళ్లీ బాగా తిప్పాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో మిశ్రమం దగ్గరగా అవుతుంది. హల్వా రూపం వస్తుంది. అలా అయ్యాక అందులో యాలకుల పొడి వేసి తిప్పాలి. తరువాత జీడిపప్పు, బాదం, పిస్తా పప్పును కూడా వేసి తిప్పాలి. 2 నిమిషాలు అలా తిప్పి దించేయాలి. దీంతో రుచికరమైన రాగి హల్వా రెడీ అవుతుంది. దీన్ని తింటే కేవలం రుచి మాత్రమే కాదు.. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.