Ragi Vada : రాగులను తినడం వల్ల మనకు ఎన్ని రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగులను చాలా మంది పిండి రూపంలో చేసి దాంతో చపాతీలు, జావ, సంగటి తయారు చేసుకుని తింటుంటారు. అయితే రాగులతో రుచికరమైన వడలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి మిర్చి – రెండు, కరివేపాకు – ఒక రెమ్మ, శనగపిండి – అర కప్పు, నూనె – సరిపడా, ఉల్లిపాయలు – ఒకటి, పల్లీలు – 150 గ్రాములు, రాగి పిండి – ఒక కప్పు, ఉప్పు – రుచికి సరిపడా.
రాగి వడలు తయారు చేసే విధానం..
పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకులను చిన్నగా, సన్నగా తరగాలి. తరువాత ఒక పాత్రలో రాగి పిండి, శనగపిండితోపాటు తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకులు, ఉప్పును వేసి బాగా కలపాలి. తరువాత పల్లీలను వేయించి పలుకులుగా చేసి పిండిలో కలుపుకోవాలి. సరిపడా నీటిని పోసి వడల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడెక్కాక అందులో చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకుని చేత్తో వత్తుతూ నూనెలో వేసి కాల్చాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన రాగి వడలు తయారవుతాయి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా పల్లీలు, కొబ్బరి చట్నీలో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. పోషకాలు లభిస్తాయి.