Vellulli Charu : వంటలలో ఉపయోగించే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో వెల్లుల్లి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. బీపీ, ఉబ్బసం, జ్వరం, కడుపులో నులి పురుగుల నిర్మూలన వంటి వాటిలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. మగ వారిలో శృంగార సామర్థ్యాన్ని పెంపొందించి, వీర్య కణాలను అభివృద్ధి చేయడంలో కూడా వెల్లుల్లి సహాయపడుతుంది. గుండె జబ్బులను, కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఈ వెల్లుల్లిని మనం ఎక్కువగా వంటల్లో, తాళింపులలో, పచ్చళ్లలో వాడుతూ ఉంటాం. ఇలా వాడడంతోపాటు వెల్లుల్లితో ఎంతో రుచిగా ఉండే చారును కూడా తయారుచేసుకోవచ్చు. వెల్లుల్లితో చారును ఏవిధంగా తయారు చేసుకోవాలి, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు – 4 , చింతపండు – 50 గ్రా., టమాటా – 1 (చిన్నది), మిరియాలు – అర టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిర్చి – 2 లేదా 3.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగ దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10, పసుపు – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 2 , ఎండు మిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు, నీళ్లు – ఒకటిన్నర గ్లాసు, ఉప్పు – రుచికి సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెల్లుల్లి చారు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో టమాటా కాయను, చింతపండును వేసి తగినన్ని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింత పండు నానిన తరువాత చింతపండుతోపాటు టమాటా నుండి కూడా గుజ్జును తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో మిగిలిన పదార్థాలను వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలా పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక.. కొత్తిమీర, నీళ్లు తప్ప మిగిలిన తాళింపు పదార్థాలన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న టమాటా, చింతపండు గుజ్జు, నీళ్లను పోసి కొద్దిగా మరిగించుకోవాలి. ఈ చారును మరీ ఎక్కువగా మరిగించకూడదు. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు తయారవుతుంది. ఈ చారును వేడి వేడి అన్నంతో తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి లభిస్తాయి.