Pippallu : పిప్పళ్లు.. ఇవి మనందరికీ తెలుసు. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఈ పిప్పళ్లు ఉండేవి. పిప్పళ్లలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పిప్పళ్ల వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటి.. అనారోగ్య సమస్యలను నయం చేయడానికి పిప్పళ్లను ఏవిధంగా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు నొప్పి, అజీర్తితో బాధపడే వారు పిప్పళ్లను, వసను ,ఇంగువను, కరక్కాయ బెరడును సమపాళ్లలో తీసుకోవాలి. ఇంగువను పొంగించి పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పదార్థాను వేయించి పొడిగా చేసి వీటన్నింటనీ కలిపి నిల్వ చేసుకోవాలి.
చిన్న పిల్లలకు పూటకు 3 గ్రాముల మోతాతులో, పెద్దలు పూటకు 6 గ్రాముల మోతాదులో రెండు పూటలా మంచి నీటితో కలిపి తీసుకుంటూ ఉంటే అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. నిద్రలేమితో బాధపడే వారు పిప్పళ్లను తీసుకుని దోరగా వేయించి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు మూడు వేళ్లకు వచ్చినంత మోతాదులో ఆ పొడిని తీసుకుని బెల్లంతో కలిపి తినడం వల్ల ఎంతోకాలం నుండి వేధిస్తున్న నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దోరగా వేయించిన పిప్పళ్లతో చేసిన చూర్ణాన్ని మూడు వేళ్లకు వచ్చినంత మోతాదులో తీసుకుని దానికి తేనెను కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే కఫ జ్వరాలు తగ్గుతాయి.
పాండు రోగంతో బాధపడే వారు పిప్పళ్ల చూర్ణానికి సమానంగా బెల్లాన్ని కలిపి దంచి కుంకుడు గింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పాండు రోగం తగ్గు ముఖం పడుతుంది. సంతాన లేమితో బాధపడుతున్న స్త్రీలు దోరగా వేయించిన పిప్పళ్లను, దూలగొండి గింజలను, ద్రాక్ష, గొబ్బి గింజలు, పటిక బెల్లాన్ని సమపాళ్లలో తీసుకుని దంచి నిల్వ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పూటకు 5 గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉంటే గర్భాశయ దోశాలు అన్ని తొలగి స్త్రీ లు గర్భం ధరిస్తారని నిపుణులు చెబుతున్నారు.
భరించలేనంత కడుపు నొప్పితో బాధపడుతుంటే పిప్పళ్లను, కరక్కాయ పెచ్చులను, సైంధవ లవణాన్ని, ఇంగువను సమపాళ్లలో తీసుకుని పొడి చేయాలి. పిప్పళ్లను, కరక్కాయ పెచ్చులను దోరగా వేయించి అన్నింటినీ కలిపి చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని పూటకు 3 గ్రాముల చొప్పున వేడి నీటితో కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే ఎంతటి భయంకరమైన కడుపు నొప్పి అయినా తగ్గుతుంది. పిప్పళ్లను, వసను కలిపి మంచి నీటితో మెత్తగా నూరాలి. దీనికి కొద్దిగా ఆముదాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని ప్రసవించలేక బాధపడుతున్న స్త్రీ నాభి మీద రాయాలి. ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలు త్వరగా ప్రసవిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఉబ్బసం వ్యాధితో బాధపడే వారు పిప్పళ్లు, మిరియాలు, సన్న రాష్ట్రం, ద్రాక్ష పండ్లు, పసుపు, నువ్వులు, బెల్లం వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకుని మెత్తగా దంచి కుంకుడు గింజలంత మాత్రలుగా చేసుకోవాలి. పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా కాచి చల్లార్చిన నీటితో తీసుకుంటూ ఉండడం వల్ల అన్ని రకాల ఉబ్బస వ్యాధులు తగ్గు ముఖం పడతాయి. ఎగ శ్వాస సమస్యతో బాధపడే వారు దోరగా వేయించిన పిప్పళ్లను, దేవదారు చెక్కను, దోరగా వేయించిన శొంఠిని సమపాళ్లలో తీసుకుని దంచి చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదులో రెండు పూటలా వేడి నీటితో కలిపి తీపుకోవడం వల్ల ఎగ శ్వాస సమస్య తగ్గుతుంది.
మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు పిప్పళ్లను, చిన్న యాలకులను, గోమూత్రంతో శుద్ధి చేసిన శిలాజిత్ ను సమపాళ్లలో తీసుకుని చూర్ణంగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటలా మంచి నీటితో కలిపి సేవిస్తూ ఉంటే మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి. కడుపులో నీరు చేరిన వారు 3 గ్రాముల పిప్పళ్ల చూర్ణాన్ని, 3 గ్రాముల సైంధవ లవణాన్ని, పావు లీటర్ మజ్జిగలో కలిపి ఉదయం పూట సేవించడం వల్ల కడుపులో చేరిన నీరు తొలగిపోతుంది. ఈ విధంగా పిప్పళ్ల మనకు ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.