వంటల్లో సుగంధ ద్రవ్యాలను మనం ఎంతో కాలం నుండి ఉపయోగిస్తూ వస్తున్నాం. శాకాహారమైనా, మాంసాహారమైనా వాటిలో సుగంధ ద్రవ్యాలను వేయగానే వాటి రుచి మరింత పెరుగుతుంది. మనం వంటల్లో తరచూ ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగం మొగ్గలు కూడా ఒకటి. సుగంధ ద్రవ్యాల్లో మేటిగా పిలిచే లవంగం మొగ్గలను పూర్తిగా విరబూయకుండానే చెట్టు నుండి వేరు చేస్తారు. లవంగం మొగ్గలు గులాబీ రంగులో ఉంటాయి. వీటిని ఎండబెట్టిన తరువాత నల్లగా మారుతాయి.
లవంగాలను కేవలం వంటల్లోనే కాకుండా ఔషధంగా కూడా మనం ఉపయోగించవచ్చు. లవంగ మొగ్గల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మనకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో లవంగాలు మనకు ఎంతగానో దోహదపడతాయి. దంతాల సమస్యలను నయం చేయడంలో లవంగాలు దివ్యౌషధంగా పని చేస్తాయి. పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.
చిగుళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు లవంగం నూనెలో దూదిని ముంచి చిగుళ్లపై రాయడం వల్ల చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నప్పుడు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల లాలాజలంలో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఒక కప్పు నీటిలో 8 లవంగాలను వేసి కాచి వడకట్టి ఆ నీటిని నిల్వ చేసుకోవాలి. రోజుకు మూడు పూటలా ఒక టీ స్పూన్ కషాయంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల ఉబ్బసం తగ్గు ముఖం పడుతుంది.
లవంగాల్లో ఉండే రసాయనాలు కఫాన్ని తొలగించడంలోనూ సహాయపడతాయి. లవంగం పొడిని నీటిలో వేపి మరిగించి తాగడం వల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. 5 లవంగాలను దంచి వస్త్రంలో ఉంచి వాసన చూస్తూ ఉండడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా లవంగం నూనెను తల మాడుపై రాసి మర్దనా చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఒక టీ స్పూన్ తేనెలో చిటికెడు లవంగాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో వికారం తగ్గుతుంది.
దగ్గు తీవ్రంగా బాధిస్తున్నప్పుడు టీ లో లవంగం పొడిని కలుపుకుని తాగడం వల్ల దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. 2 లవంగాలను నోట్లో వేసుకుని రసం మింగుతూ ఉండడం వల్ల మద్యం తాగాలనే ఆలోచన రాకుండా ఉంటుంది. లేత మామిడి ఆకుల రసంలో లవంగం పొడిని కలుపుకుని తాగడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, వాంతులు తగ్గుతాయి. లవంగాలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులు లవంగాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఆహారంలో లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులపై లవంగం నూనెను పై పూతగా రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గంధంలో లవంగం పొడిని కలుపుకుని శరీరానికి నలుగుగా రాసుకుని స్నానం చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవడమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను నశింపజేసి మన శరీరం క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో ఉపయోగపడతాయి. రెండు టీ స్పూన్ల నువ్వుల నూనెలో రెండు చుక్కల లవంగం నూనెను వేసి వేడి చేసి చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. తరచూ లవంగాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
అయితే ఏదైనా కూడా మనం పరిమితంగానే తీసుకోవాలి. లవంగాలను కూడా పరిమితంగా తీసుకోవడం వల్ల మాత్రమే మనం వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. లవంగం నూనెను చర్మానికి ఎక్కువ మొత్తంలో రాయడం వల్ల చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. అంతేకాకుండా చర్మంపై దురదలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక లవంగాలను తగిన మోతాదులో తీసుకుని ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.