స్వీట్ షాప్స్‌లో ల‌భించే విధంగా.. కారం బూందీని ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో దొరికే ఆహార ప‌దార్థాల్లో కారం బూందీ కూడా ఒక‌టి. కారం బూందీ ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ కారం బూందీని మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా కారం బూందీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న‌వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కారం బూందీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, నీళ్లు – ముప్పావు క‌ప్పు లేదా త‌గిన‌న్ని, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా, ప‌ల్లీలు – పావు క‌ప్పు, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్.

make boondi in this way like available in sweet shops

కారం బూందీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని, ప‌స‌పును, వంట‌సోడాను వేసి క‌లుపుకోవాలి. త‌రువాత నీళ్ల‌ను పోసుకుంటూ ఉండ‌లు లేకుండా ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బూందీ త‌యారు చేసే గంటెను కానీ, జ‌ల్లి గంటెను కానీ తీసుకుని అందులో పిండిని వేస్తూ  క‌ల‌ప‌డం వ‌ల్ల బూందీ చ‌క్క‌గా నూనెలో ప‌డుతుంది. ఈ బూందీని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని టిష్యూ పేప‌ర్ ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి.

త‌రువాత అదే నూనెలో ప‌ల్లీల‌ను, క‌రివేపాకును వేసి వేయించి బూందీలో వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, కారాన్ని, ఉప్పును, ధ‌నియాల పొడిని, జీల‌క‌ర్ర పొడిని వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ వెల్లుల్లి కారాన్ని కూడా బూందీలో వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా బ‌య‌ట షాపుల్లో దొరికే విధంగా ఉండే కారం బూందీ త‌యార‌వుతుంది. ఈ కారం బూందీని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. బ‌య‌ట అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో త‌యారు చేసే చిరుతిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే శుచిగా కారంబూందీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

D

Recent Posts