కంటికి ఇంపుగా కనిపించే ఆహారాలను చాలా మంది ఇష్టంగా తింటారు. కొందరు వాటిని అతిగా తింటారు. దీంతో అజీర్ణ సమస్య వస్తుంది. ఇక కొందరు కారం, మసాలాలు, జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. కొందరు విపరీతంగా మద్యం సేవిస్తారు. కొందరు సమయానికి భోజనం చేయరు. ఇవన్నీ అజీర్ణ సమస్యకు కారణమవుతుంటాయి. అయితే అజీర్ణ సమస్య తగ్గేందుకు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
1. ధనియాలు, శొంటి సమంగా కలిపి నీటిలో బాగా మరిగించాలి. అనంతరం చల్లార్చి 30 ఎంఎల్ చొప్పున రోజూ తీసుకోవాలి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
2. బెల్లం, శొంఠిలను సమాన భాగాల్లో కలిపి నూరి కుంకుడు గింజంత ముద్దలుగా చేసుకుని నీటితో రోజూ తీసుకోవాలి.
3. బెల్లం, దానిమ్మకాయ బెరడు రెండూ కలిపి పొడి చేయాలి. దాన్ని మజ్జిగతో తీసుకోవాలి.
4. నల్ల ద్రాక్ష, కరక్కాయ కలిపి తింటే అజీర్ణం తగ్గుతుంది.
5. శొంఠి, పిప్పళ్లు, కరక్కాయ పెచ్చులను సమాన భాగాల్లో తీసుకుని వాటిని అరగ్లాస్ మజ్జిగతో తీసుకోవాలి. దీంతో అజీర్ణం, గ్యాస్ తగ్గుతాయి.
6. వాము పొడి, సైంధవ లవణం సమాన భాగాల్లో కలిపి మజ్జిగతో తీసుకోవాలి. కడుపు ఉబ్బరం, అజీర్ణం తగ్గుతాయి.
7. శొంఠి, మిరియాలు, వేప చెట్టు బెరడు చూర్ణంలను కలిపి పొడి చేసి నీటితో ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. పుల్లని త్రేన్పులు తగ్గుతాయి. అజీర్ణం ఉండదు.
8. జీలకర్ర, శొంఠి, పిప్పళ్లు, వాము, పసుపులను సమాన భాగాల్లో తీసుకుని పొడి చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో మొదటి ముద్దలో కలిపి నెయ్యి వేసి పిల్లలకు తినిపించాలి. ఆకలి బాగా అవుతుంది.
అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినరాదు. మాడిపోయిన, ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న, పైన ఉప్పు తేలిన ఆహారాలను తీసుకోరాదు. రోజూ అన్ని రుచులు ఉండే ఆహారాలను తీసుకోవాలి. భోజనంలో మొదట తీపి పదార్థాలు, తరువాత పులుపు, తరువాత ఉప్పు కలిసిన పదార్థాలు, చివర్లో చేదు ఆహారాలు తీసుకోవాలి. భోజనం మొదటి ముద్దలో పాత ఉసిరికాయ పచ్చడి తింటే మేలు. రాత్రి భోజనంలో పాత నిమ్మకాయ పచ్చడి తినాలి. భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగ లేదా పాలు కచ్చితంగా తీసుకోవాలి. ఆహారం గొంతు దాకా వచ్చే వరకు తినరాదు. కడుపులో సగం వరకు ఆహారం ఉండేలా, ఒక వంతు నీరు ఉండేలా, మిగిలిన భాగం ఖాళీగా ఉండేలా తినాలి.
మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ఈర్ష్య, అసూయ, భయం, వేదన వంటివి జీర్ణ రసాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. వేళకు భోజనం చేయాలి. ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ వస్తుంది. చల్లని నీటిని ఎక్కువగా తాగినా, మలమూత్రాలను ఎక్కువ సేపు ఆపుకున్నా జీర్ణ సమస్యలు వస్తాయి.
ఆహారం తీసుకునేటప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. కోపంతో ఆహారం తినరాదు. కారు డ్రైవింగ్ చేస్తూ, పుస్తకాలు చదువుతూ, టీవీలు చూస్తూ భోజనం చేయరాదు. ఇతరులతో వాదిస్తూ భోజనం చేయరాదు. టైం కాని టైంలో తినరాదు. ముందు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక పోతే ఆ పూటకు భోజనం మానేయడం మంచిది. అలాంటి స్థితిలో మజ్జిగ, నిమ్మరసం తీసుకోవచ్చు. రాత్రి పూట పెరుగు తీసుకోరాదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365