రక్తహీనత సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..!

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. పోషకాలు లోపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కో పోషక పదార్థం లోపం వల్ల భిన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఐరన్‌ లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇంకొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కేవలం ఐరన్‌ లోపం వల్లే కాదు, పలు ఇతర కారణాల వల్ల కూడా రక్తహీనత వస్తుంటుంది.

ayurvedic solutions for anemia

గాయాలకు గురైనప్పుడు తీవ్రంగా రక్తస్రావం అవడం, మహిళలకు రుతు సమయంలో రక్త స్రావం ఎక్కువగా అవడం, పలు రకాల ఇంగ్లిష్‌ మెడిసిన్లను సుదీర్ఘకాలం పాటు వాడడం.. వంటి అనేక కారణాల వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. దీన్ని తగ్గించుకోకపోతే ఇంకా పలు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

రక్తహీనత వచ్చిన వారి శరీరం.. ముఖ్యంగా ముఖం ఉబ్బిపోయి కనిపిస్తుంది. కళ్లు పసుపు పచ్చ రంగులోకి మారుతాయి. చర్మం తెల్లగా పాలిపోయినట్లు అవుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాళ్లు, చేతులు లాగుతాయి. భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే పూర్తిగా విరేచనం అవదు. మాటి మాటికీ మలవిసర్జన చేయాల్సి వస్తుంది. తీవ్రంగా నీరసం ఉండి ఎప్పుడూ పడుకోవాలని అనిపిస్తుంది. బీపీ తక్కువగా ఉంటుంది. గుండె దడ వచ్చినట్లు ఉంటుంది. ఆకలి ఉండదు. కళ్ల కింద, పాదాల దగ్గర వాపులు కనిపిస్తాయి. కాలి వేళ్ల మధ్య పగుళ్లు వస్తాయి. చర్మం ఎండిపోయినట్లు అవుతుంది. ఇలా రక్తహీనత సమస్య ఉన్నవారిలో భిన్నమైన లక్షణాలు కనిపిస్తాయి.

పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్‌ సూచన మేరకు మందులను వాడుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎక్కువగా ఐరన్‌ ఉండే ట్యాబ్లెట్లతోపాటు మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లను వాడమని సూచిస్తారు. కనుక ఆయా మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఇక రక్తహీనత ఉన్నవారు ఐరన్‌ లోపాన్ని తగ్గించుకునేందుకు ఐరన్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

1. లోహసవం, పునర్నవాది మండూరం, హరీతకీ చూర్ణం, కుమార్యాసవం వంటి ఆయుర్వేద మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవచ్చు.

2. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ గోధుమ, శాలి ధాన్యం, కందిపప్పు, మజ్జిగ, పాలు తాగాలి.

3. ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, వాము 50 గ్రాములు, కందిపప్పు 100 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు కలిపి వేయించి పొడి చేసుకుని అన్నంలో మొదటి ముద్దలో తింటుండాలి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. మనం తినే ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది.

4. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, ఆకుపత్రి, రేగు గింజల పప్పు కలిపి మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకుంటే మంచిది.

5. గోంగూర, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలను తీసుకోవడం వల్ల రక్త పెరగడంతోపాటు రక్తం శుద్ధి అవుతుంది.

6. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పటికబెల్లం పొడి కలిపిన పాలు తాగడం వల్ల కూడా రక్తం వృద్ధి అవుతుంది.

7. ఒక తులం పసుపు, నాలుగు తులాల పెరుగులో కలుపుకుని తింటుంటే రక్తదోషాలన్నీ పోతాయి.

8. ద్రాక్ష, దానిమ్మ, క్యారెట్‌, బీట్‌రూట్‌ రసాలను రోజూ తాగితే రక్తం వృద్ధి అవుతుంది.

9. చల్లని పదార్థాలు, మసాలాలు, శనగ పిండితో చేసిన పదార్థాలను కొంత కాలం మానేయాలి.

ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts