Beauty Tips : మనం వివిధ రూపాల్లో అల్లాన్ని ప్రతిరోజూ వాడుతూ ఉంటాం. అల్లాన్ని వంటలలో ఉపయోగించడమే కాకుండా అల్లంతో టీలను, కషాయాలను కూడా తయారు చేసి తాగుతూ ఉంటాం. అల్లాన్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని కూడా వాడుతూ ఉంటాం. దీనినే శొంఠి పొడి (చూర్ణం) అంటారని మనందరికీ తెలుసు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనందరికీ తెలుసు. శొంఠి పొడిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శొంఠి పొడిని నీళ్లలో లేదా అన్నం కలుపుకుని తినడం వల్ల ఆకలి శక్తి పెరగడం, అజీర్తి, జ్వరం, జలుబు, దగ్గు, వికారం, వాంతులతోపాటు జీర్ణాశయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
బరువును తగ్గించడంలోనూ శొంఠి పొడి ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా శొంఠి పొడితో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండు టేబుల్ స్పూన్ల శొంఠి పొడిని నాలుగు కప్పుల నీళ్లలో వేసి ఈ నీటిని రెండు కప్పులు అయ్యే వరకు మరిగించాలి. ఇలా మరిగించిన నీటిలో రెండు టీ స్పూన్ల లావెండర్ నూనెను వేసి నాలుగు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. నాలుగు గంటల తరువాత దూదితో ఈ నీటిని తీసుకుంటూ చర్మంపై రాసుకని 20 నిమిషాల తరువాత నీటితో కడిగి వేయాలి.
ఇలా చేయడం వల్ల చర్మం రంగు మారడమే కాకుండా నిగారింపును, కాంతిని సొంతం చేసుకుంటుందని, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మరిగించిన నీటిని ఫ్రిజ్ లోనే ఉంచి మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. చర్మ సౌందర్యానికి హానిని కలిగించే రసాయనాలను వాడడానికి బదులుగా శొంఠి పొడిని వాడడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు కలగకుండా చర్మ సౌందర్యంతోపాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.