Carrot Oil For Skin : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మన ఆరోగ్యాన్ని సంరక్షించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో క్యారెట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యారెట్ ను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కేవలం క్యారెట్ మాత్రమే కాకుండా క్యారెట్ నుండి తీసిన నూనె కూడా మన చర్మానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది జిడ్డు చర్మంతో బాధపడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ వీరి చర్మం జిడ్డుగా ఉంటుంది. దీంతో చర్మంపై మలినాలు పేరుకుపోయి మొటిమల వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఇలా జిడ్డు చర్మంతో బాధపడే వారు క్యారెట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ ఆయిల్ లో జిరానిల్ ఎసిటేట్ మరియు అల్ఫాపైనిల్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే గ్రంథుల నుండి జిడ్డు ఎక్కువగా విడుదల అవ్వకుండా చేయడంలో సహాయపడతాయి. దీంతో చర్మం జిడ్డుగా మారకుండా ఉంటుందని జిడ్డు చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో క్యారెట్ ఆయిల్ అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అతినీల లోహిత కిరణాల కారణంగా చర్మం దెబ్బతింటుంది. దీని వల్ల కూడా కొందరిలో చర్మం నుండి జిడ్డు కారుతుంది. చర్మం నుండి జిడ్డు కారకుండా చేసి అతినీల లోహిత కిరణాల కారణంగా దెబ్బతిన్న చర్మాన్ని బాగు చేయటంలో కూడా మనకు ఈ క్యారెట్ ఆయిల్ ఉపయోగపడుతుంది.
అలాగే ఎండలో తిరగడం వల్ల మన చర్మం డీ హైడ్రేషన్ కు గురి అయ్యి పొడి బారుతూ ఉంటుంది. ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు క్యారెట్ ఆయిల్ ను చర్మానికి రాసుకుని బయటకు వెళ్లడం వల్ల చర్మం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. అలాగే చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంచడంలో ఎండ వల్ల చర్మం రంగు మారకుండా చేయడంలో మనకు క్యారెట్ ఆయిల్ ఎంతో దోహదపడుతుంది. మన చర్మ సౌందర్యానికి ఎంతో మేలు ఈ క్యారెట్ ఆయిల్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1 ఎమ్ ఎల్ క్యారెట్ ఆయిల్ కు 5 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను కలిపి వాడాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ముఖానికి, చేతులకు, మెడకు అలాగే చర్మం నుండి జిడ్డు ఎక్కువగా విడుదల అయ్యే భాగాల్లో రాసుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు. క్యారెట్ ఆయిల్ మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొయంబ్రా, పోర్చుగీస్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. జిడ్డు చర్మతత్వం ఉన్న వారు ఈ విధంగా క్యారెట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.