Ragi Saggubiyyam Payasam : రాగులు, స‌గ్గుబియ్యం క‌లిపి ఎంతో టేస్టీగా ఉండే పాయ‌సాన్ని ఇలా చేసుకోవ‌చ్చు.. ఆరోగ్య‌క‌రం కూడా..

Ragi Saggubiyyam Payasam : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. రాగుల్లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పోష‌కాలు, అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని పిండిగా చేసి జావ‌, రొట్టె, సంగ‌టి వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా రాగి పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగిపిండితో చేసే పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే రాగి స‌గ్గు బియ్యం పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి స‌గ్గుబియ్యం పాయ‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌గ్గు బియ్యం – అర టీ గ్లాస్, రాగి పిండి – పావు టీ గ్లాస్, పాలు – 6 టీ గ్లాసులు, దంచిన యాల‌కులు – 4, బెల్లం తురుము – రెండు టీ గ్లాసులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – త‌గిన‌న్ని.

Ragi Saggubiyyam Payasam recipe in telugu make in this method
Ragi Saggubiyyam Payasam

రాగి స‌గ్గుబియ్యం పాయ‌సం త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో స‌గ్గు బియ్యాన్ని తీసుకోవాలి. త‌రువాత ఇందులో త‌గిన‌న్ని నీళ్లు పోసి గంట పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకుని నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగు వ‌చ్చే వ‌ర‌కు వేడి చేసిన తరువాత నాన‌బెట్టుకుని స‌గ్గు బియ్యాన్ని వ‌డ‌క‌ట్టి వేసి క‌ల‌పాలి. ఈ స‌గ్గు బియ్యాన్ని మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న రాగిపిండి, యాల‌కులు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో మూడు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత ఇందులో బెల్లాన్ని వేసి క‌దిలించ‌కుండా ప‌క్క‌కు ఉంచాలి. మ‌రో క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ చ‌క్క‌గా వేగిన త‌రువాత వీటిని కూడా పాయ‌సంలో వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. బెల్లం కూడా క‌రిగే వ‌ర‌కు కలుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి స‌గ్గుబియ్యం పాయ‌సం త‌యార‌వుతుంది. ఈ పాయ‌సాన్ని త‌యారు చేసి తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా రాగిపిండితో పాయసాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ పాయ‌సాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts