Venna : మనం ఆహారంలో భాగంగా పాల నుండి తయారయ్యే వెన్నను కూడా తీసుకుంటూ ఉంటాం. వెన్న కూడా శరీరానికి అవసరమయ్యే పోషకాలను కలిగి ఉంటుంది. వెన్నలో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలతోపాటు విటమిన్ డి, విటమిన్ ఇ లు అధికంగా ఉంటాయి. వెన్నను తరుచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వెన్న సౌందర్య సాధనంగా కూడా పని చేస్తుంది. ప్రతి రోజూ వెన్నను తినడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిని సంతరించుకుంటుంది. వెన్నను ఆహారంలో భాగంగా తీసుకున్నా లేదా వెన్నను శరీరానికి రుద్దుకుని స్నానం చేసినా ఆరోగ్యంతోపాటు శరీర ఛాయ కూడా పెరుగుతుంది.
మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడంలో వెన్న ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి సహజ సిద్ధంగా లభించే వెన్నను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పిల్లలకు స్నానం చేయించడానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల పిల్లల చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉండే సన్నని వెంట్రుకలు కూడా పోతాయి. వెన్నను ముఖానికి రాసుకుని మెత్తటి సున్నిపిండిలో పసుపును కలిపి ముఖాన్ని రుద్దుకోవడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది. నల్లగా ఉన్న వారు వెన్నలో తేనెను కలిపి నిత్యం చర్మం పై రాస్తూ ఉండడం వల్ల నలుపు తగ్గి చర్మం కాంతిని సంతరించుకుంటుంది.
లిప్ స్టిక్ లను, లిప్ బామ్ లను వాడడానికి బదులుగా వెన్నలో గులాబీ రెక్కల పేస్ట్ ను కలిపి రాసుకోవడం వల్ల పెదవులు పింక్ రంగును సంతరించుకోవడమే కాకుండా ఎండిపోకుండా కూడా ఉంటాయి. వెన్నలో కోడిగుడ్డు తెల్ల సొనను కలిపి రాసుకోవడం వల్ల కళ్ల కింద ఉండే మచ్చలు, ముడతలు తగ్గుతాయి. వెన్నలో పసుపును కలిపి రాయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. వెన్నలో నల్ల నువ్వులను కలిపి మూత్రలుగా చేసి తింటూ ఉండడం వల్ల జుట్టు నెరవకుండా నల్ల రంగులోనే ఉంటుంది. ప్రతిరోజూ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో వెన్నను కలిపి తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. వెన్నను కనురెప్పలపై రాయడం వల్ల కనురెప్పల వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి. బొప్పాయి పండు గుజ్జులో వెన్నను కలిపి ముఖానికి రాసి సున్నితంగా మర్దనా చేస్తే ముఖం పొడిబారకుండా కాంతివంతంగా అందంగా కనిపిస్తుంది.