కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని అనేక ఆయుర్వేద ఔషధాలు, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో వాడుతుంటారు. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు చర్మం, వెంట్రుకలకు మేలు చేస్తాయి. అలొవెరాను ఉపయోగించి వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరిగేలా చేయవచ్చు. ఈ క్రమంలోనే ఆ చిట్కాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
* అలొవెరా గుజ్జును శిరోజాలకు బాగా రాయాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా మర్దనా చేయాలి. తరువాత కొంత సేపు అలాగే ఉంచి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు సంరక్షింపబడతాయి. జుట్టు పెరుగుతుంది. చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడం సమస్యలు ఉండవు. ఇంట్లో అలొవెరా మొక్క ఉంటే దాన్నుంచి గుజ్జు తీసి దాన్ని ఉపయోగించవచ్చు. లేదా మార్కెట్‌లోనూ మనకు అలొవెరా జెల్ దొరుకుతుంది. దాన్ని కూడా వాడవచ్చు.
* అరకప్పు అలొవెరా జెల్, పావు కప్పు అల్లం తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా మార్చుకోవాలి. దాన్ని తలకు బాగా పట్టించి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. వారంలో 2 లేదా 3 సార్లు ఇలా చేస్తే వెంట్రుకల సమస్యల నుంచి బయట పడవచ్చు. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి.
* కొబ్బరినూనె, అలొవెరా జెల్‌లను కలిపి పాత్రలో తీసుకుని బాగా మరిగించాలి. మిశ్రమం నుంచి బుడగలు వచ్చే వరకు మరిగించాక చల్లార్చాలి. అనంతరం ఆయిల్‌ను మాత్రమే తీయాలి. దాన్ని బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ఆ ఆయిల్‌ను తలస్నానం చేసేందుకు కనీసం మూడు లేదా నాలుగు గంటల ముందు అప్లై చేయాలి. లేదా రాత్రి తలకు అప్లై చేసి మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు. ఇలా తరచూ చేస్తుంటే వెంట్రుకలు చక్కని నిగారింపును సొంతం చేసుకుంటాయి. జుట్టు బాగా పెరుగుతుంది.
* అలొవెరా జెల్ అర కప్పు, మూడు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌లను తీసుకుని కలిపి మిక్సీ పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని జుట్టుకు బాగా రాసి మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా నశిస్తుంది. చుండ్రు సమస్యలు ఉండవు. జుట్టు దృఢంగా పెరుగుతుంది.
పైన తెలిపిన పదార్థాలకు బదులుగా ఆముదం, తేనెలను కూడా అలొవెరా జెల్‌కు కలిపి ఉపయోగించవచ్చు. ఈ విధంగా తరచూ చేయడం వల్ల అన్ని రకాల వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365