Blackness On Neck : మనలో చాలా మందికి ముఖం తెల్లగా అందంగా ఉన్నప్పటికీ మెడ భాగం నలుపు రంగులో ఉంటుంది. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎండలో ఎక్కువగా తిరగడం, అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత, శరీరంలో ఉండే ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మెడ భాగం ఎక్కువగా నలుపు రంగులోకి మారుతుంది. మన ఇంట్లో ఉండే సహజసిద్ధ పదార్థాలతో పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మెడ భాగంలో చర్మంపై ఉండే నలుపు తొలగిపోయి చర్మం సాధారణ రంగులోకి వస్తుంది.
మెడ భాగంలో చర్మాన్ని తెల్లగా మార్చే ఈ పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, 2 టేబుల్ స్పూన్ల పెరుగును, చిటికెడు పసుపును, ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప రసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కొందరిలో శనగ పిండిని ఉపయోగించడం వల్ల చర్మం దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు శనగపిండికి బదులుగా గోధుమ పిండిని కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఈ పేస్ట్ తయారీలో వంటల్లో వాడే పసుపును లేదా కస్తూరి పసుపును కూడా ఉపయోగించవచ్చు.
మెడ భాగంలో చర్మం నలుపు రంగులో ఉండి ఇబ్బందిపడుతున్న వారు పైన తెలిపిన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మెడ చుట్టూ రాసుకుని ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల మెడ భాగంలో చర్మంపై ఉండే నలుపు తొలగిపోతుంది. ఈ పేస్ట్ ను కేవలం మెడ భాగంలోనే కాకుండా చర్మం నలుపు రంగులో ఉండే ఇతర శరీర భాగాలు.. అంటే.. మోకాళ్లు, మోచేతులు, చంకల భాగాలపై కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా సహజసిద్ధంగా ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండా చాలా తక్కువ ఖర్చులోనే నల్లగా ఉండే మెడను తెల్లగా మార్చుకోవచ్చు.