Mouth Ulcer : మనల్ని వేధించే నోటి సంబంధిత సమస్యల్లో నోట్లో పుండ్లు, కురుపులు రావడం కూడా ఒకటి. వీటినే మౌత్ అల్సర్స్, నంజు పొక్కులు అని కూడా అంటారు. ఇవి నోటిలో ఎక్కడపడితే అక్కడ వస్తూ ఉంటాయి. నోటిలో వచ్చే ఈ పుండ్లు మంటను, నొప్పిని కలిగిస్తాయి. వీటి కారణంగా మనం ఆహారాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. మన శరీరంలో రైబోఫ్లేవిన్ అనే బి విటిమిన్ లోపం వల్ల నోటి పుండ్లు వస్తాయి. రైబోఫ్లేవిన్ అనే ఈ విటమిన్ ధాన్యాల పై పొరల్లో ఎక్కువగా ఉంటుంది. ధాన్యాలను పాలిష్ పట్టుకుని తినడం వల్ల వాటిపై పొరల్లో ఉండే రైబోఫ్లేవిన్ విటమిన్ తవుడులోకి వెళ్లిపోతుంది. దీంతో మనం ఆహారాన్ని తీసుకున్నప్పటికీ మన శరీరంలో రైబోఫ్లేవిన్ విటమిన్ లోపం ఏర్పడి నోటిలో పొక్కులు వస్తాయి.
కొందరిలో మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా ఈ నోటి పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నోటి పొక్కుల సమస్య నుండి బయటపడడానికి మనం ఎక్కువగా రైబోఫ్లేవిన్ విటమిన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. సాధారణంగా ఈ రైబోఫ్లేవిన్ అనే విటమిన్ రోజుకు స్త్రీలకు 1.1 మిల్లీ గ్రాములు, పురుషులకు 1.3 మిల్లీ గ్రాముల మోతాదులో అవసరమవుతుంది. ఈ రైబోఫ్లేవిన్ అనే విటమిన్ అత్యధికంగా పుట్టగొడుగుల్లో 0.4 నుండి 0.5 మిల్లీ గ్రాముల మోతాదులో ఉంటుంది. పుట్ట గొడుగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కూడా మనం నోట్లో పుండ్ల సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే సోయా గింజలతో చేసే పనీర్ లో కూడా 0.4 నుండి 0.5 మిల్లీ గ్రాముల రైబోఫ్లేవిన్ ఉంటుంది. ఈ సోయా పనీర్ తో వంటలను చేసుకుని తినడం వల్ల శరీరానికి తగినంత రైబోఫ్లేవిన్ విటమిన్ లభిస్తుంది. దీంతో నోట్లో పుండ్ల సమస్య నుండి మనకు ఉపశమనం కలుగుతుంది.
అదేవిధంగా మునగాకులో 0.4 మిల్లీ గ్రాముల రైబోఫ్లేవిన్ విటమిన్ ఉంటుంది. మునగాకును ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే తవుడులో కూడా 0.4 మిల్లీ గ్రాముల రైబోఫ్లేవిన్ విటమిన్ ఉంటుంది. రోజుకు రెండు గుప్పిళ్ల తవుడును ఆహారంగా తీసుకోవడం వల్ల రైబోఫ్లేవిన్ తోపాటు ఇతర పోషకాలు కూడా మన శరీరానికి లభిస్తాయి. ఈ నాలుగు రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నంజు పొక్కులు త్వరగా తగ్గడమే కాకుండా మరలా రాకుండా కూడా ఉంటాయి. అలాగే నంజు పొక్కుల మీద రోజుకి నాలుగు నుండి ఐదు సార్లు తేనెను రాయడం వల్ల మంట నుండి ఉపశమనం కలుగుతుంది. తరచూ నంజు పొక్కుల సమస్యతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రైబోఫ్లేవిన్ విటమిన్ లోపం తగ్గి.. నంజు పొక్కులు కూడా తగ్గుతాయి.