అక్బర్, బీర్బల్ కథల గురించి అందరికీ తెలిసిందే. చిన్నారులు మొదలుకొని పెద్దల వరకు దాదాపు అందరికీ ఆ కథలంటే ఇష్టమే. వినోదానికి తోడు ఆ కథలు విజ్ఞానాన్ని, నీతిని కూడా అందిస్తాయి. అయితే ఆ కథల్లోని ఓ ముఖ్యమైన కథ గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. అదేమిటంటే అక్బర్ ఒకానొక సందర్భంలో దేవుడికి సంబంధించిన 4 క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కావాలని బీర్బల్‌ను అడుగుతాడట. ఈ క్రమంలో బీర్బల్ అందుకు తెలివిగా జవాబులు చెప్తాడట. అసలు అక్బర్ సంధించిన ప్రశ్నలకు బీర్బల్ ఏం సమాధానం చెప్పాడన్నదే అసలు కథ. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకరోజు అక్బర్ బీర్బల్‌ను దేవుడికి సంబంధించిన 4 కష్టతరమైన ప్రశ్నలను అడుగుతాడని పైన చెప్పాం కదా! అవేమిటంటే 1) దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? 2) అసలు దేవుడు ఏం చేస్తాడు? 3) అతను ఏం తింటాడు? 4) దేవుడు తాను ఏం చేయాలనుకున్నా చేయగలడు కదా, అలాంటప్పుడు తాను మనిషి రూపాన్నే ఎందుకు ధరిస్తాడు?
ఇలా అక్బర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ బీర్బల్ ఓపిగ్గా సమాధానమిచ్చాడు. అవేమిటంటే… 1) దేవుడు తన భక్తుల హృదయాల్లోనే ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు. అతను అక్కడే నివసిస్తాడు. అతన్ని చూడగలిగిన భక్తులకు మాత్రమే అతను కనిపిస్తాడు. 2) ఉన్నత అంతస్తుల్లో విర్రవీగేవారిని పాతాళానికి తోయడం, పాతాళంలో ఉండి కష్టపడుతున్న వారిని ఉన్నత అంతస్తుకు తీసుకురావడం వంటి పనులు చేస్తాడు. 3) మనుషుల్లో ఉన్న అహంకారం (ఈగో)ను దేవుడు సేవిస్తాడు.
ఇక చివరిగా 4వ ప్రశ్న మిగిలి ఉండగా దానికి సమాధానం చెప్పేందుకు మాత్రం బీర్బల్ అక్బర్‌ను కొంత గడువు కావాలని అడిగాడు. అందుకు అక్బర్ ఒప్పుకున్నాడు. కాగా ఒక రోజు అక్బర్ గారాల చిన్నారి కుమారుడికి సపర్యలు చేస్తున్న చెలికత్తె వద్దకు బీర్బల్ వస్తాడు. అప్పుడతను ఆమెతో ఓ విషయం చెప్తాడు. అదేంటంటే మరో 2, 3 రోజుల్లో ఏదో ఒక సమయం చూసి అక్బర్‌ను పక్కనే ఉన్న కొలనుకు తీసుకువస్తానని, అప్పుడు అక్బర్ కుమారుడిని పోలిన ఓ బొమ్మను అక్బర్ చూస్తుండగానే ఆ కొలనులో పడేయమని, ఆ తరువాత జరిగేది తాను చూసుకుంటానని బీర్బల్ చెప్తాడు. దీంతో బీర్బల్ చెప్పినట్టుగానే ఓ రోజు అక్బర్‌ను కొలను వద్దకు తీసుకువస్తాడు. అప్పుడు ఆ చెలికత్తె అంతకు ముందు బీర్బల్ చెప్పిన విధంగానే అక్బర్ కుమారుడిని పోలిన ఓ బొమ్మను తీసుకువచ్చి అక్బర్ చూస్తుండగానే దాన్ని కొలనులోకి వేస్తుంది.
అది చూసిన అక్బర్ తన బిడ్డను కొలనులో పడేశారని భావించి బిడ్డను రక్షించేందుకు కొలనులోకి దూకబోతాడు. అంతలో బీర్బల్ అడ్డం పడి కాపాడాల్సిన పని లేదని చెప్తాడు. దీంతో అక్బర్‌కు ఒళ్లు మండి బీర్బల్‌ను కఠినంగా శిక్షించాలని హుకుం జారీ చేస్తాడు. అయితే బీర్బల్ వెంటనే తన 4వ ప్రశ్నకు సమాధానం చెప్పానని అక్బర్‌కు చెప్తాడు. దీంతో ఆశ్చర్యపోయిన అక్బర్ విషయాన్ని వివరించమని బీర్బల్‌ను అడుగుతాడు. అప్పుడు బీర్బల్ సమాధానమిస్తూ ఎంతో మంది పనివారు ఉండగా మీ కొడుకుని రక్షించడం కోసం మీరే స్వయంగా ఎందుకు కొలనులోకి దిగారు? అంటే, మీలో దేవుడున్నాడు. కాబట్టే ఆ దేవుడు మీ రూపంలో బయటికి వచ్చి చిన్నారిని రక్షించాలని చూశాడు. అని బీర్బల్ వివరిస్తాడు. దీంతో అక్బర్ సంతృప్తి చెంది బీర్బల్‌ను ఘనంగా సత్కరిస్తాడు. తెలుసుకున్నారుగా, దేవుడి గురించి బీర్బల్ అక్బర్‌కు ఏం చెప్పాడో!