Phool Makhana Curry : ఫూల్ మఖనా.. ప్రస్తుత కాలంలో వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. తామర గింజలతో చేసే ఈ ఫూల్ మఖనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఫూల్ మఖనాతో మనం ఎంతో రుచిగా ఉండే కూరలను తయారు చేసుకోవచ్చు. ఫూల్ మఖనాతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫూల్ మఖనాతో రుచిగా, సులభంగా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫూల్ మఖనా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఫూల్ మఖనా – ఒక కప్పు, టమాటాలు – 2, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, జీడిపప్పు – 10, తరిగిన పచ్చిమిర్చి – 3, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
ఫూల్ మఖనా కూర తయారీ విధానం..
ముందుగా టమాటాలను పేస్ట్ గా చేసి పక్కకు ఉంచాలి. అలాగే జీడిపప్పును కూడా పేస్ట్ గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఫూల్ మఖనాను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు, వేయించిన ఫూల్ మఖనా వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కసూరి మెంతి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫూల్ మఖనా కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఫూల్ మఖనాతో కూరను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.