మనలో చాలా మందికి సహజంగానే కాలి మడమల నొప్పులు వస్తుంటాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి ఉండడం, మహిళల్లో అయితే ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం, శరీరంలో కాల్షియం లోపించడం, వ్యాయామం చేయకపోవడం.. వంటి పలు కారణాల వల్ల కాలి మడమల నొప్పులు వస్తుంటాయి. అయితే పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించి ఆ నొప్పులను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. దీని వల్ల మడమల నొప్పులు వెంటనే తగ్గుతాయి. ఆ నొప్పుల నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
2. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుని బాగా నీటిని తాగాలి. తరువాత కాళ్లను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. అనంతరం మరో 3 నిమిషాల పాటు చల్లని నీటిలో ఉంచాలి. ఇలా 3 సార్లు చేయాలి. దీంతో మడమల నొప్పులు తగ్గుతాయి.
3. నొప్పులను తగ్గించడంలో లవంగ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. మడమలపై లవంగనూనె బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
4. ఆలుగడ్డలు, కీరదోస, ఉసిరికాయలు, టమాటాలు, పచ్చి బొప్పాయి, క్యాబేజీ వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్లే నొప్పులు తగ్గుతాయి.
5. మడమల నొప్పులను తగ్గించేందుకు ఆవ గింజలు కూడా పనిచేస్తాయి. కొన్ని ఆవ గింజలను తీసుకుని బాగా నూరి పొడిలా చేయాలి. అనంతరం ఒక బకెట్‌లో వేడి నీటిని తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఆవ గింజల పొడి వేయాలి. తరువాత ఆ బకెట్‌లో కాళ్లను 12 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో మడమల నొప్పులు తగ్గుతాయి.
6. రాక్ సాల్ట్‌లో మెగ్నిషియం సల్ఫేట్ ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించడంలో పనిచేస్తుంది. ఒక బకెట్‌లో వేడి నీటిని తీసుకుని అందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేయాలి. తరువాత ఆ బకెట్‌లో కాళ్లను 15 నిమిషాల పాటు ఉంచాలి. నొప్పులు తగ్గుతాయి.
7. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు, తేనెలను కలుపుకుని తాగడం వల్ల కూడా మడమల నొప్పులు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365