యుక్త వయస్సు వస్తుంటే ఆడ, మగ ఎవరికైనా మొటిమలు వస్తుంటాయి. వాటిని చూసి అలా వదిలేస్తేనే మంచిది. కానీ కొందరు అలా కాదు, మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పి వాటిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటారు. అది వచ్చీ రాకముందే దాన్ని నలుపుతూ, చిదుముతూ రక రకాలుగా దాన్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అయితే మీకు తెలుసా..? నిజానికి మొటిమలు అలా వదిలేయడమే బెటరట. అలా కాకుండా చిదమడం, నలపడం లాంటివి చేస్తే దాంతో ఇంకా ఇతర అనేక సమస్యలు వస్తాయి. అవేమిటంటే..? ఏ మొటిమ అయినా రావడానికి ముందు ఆ భాగంలో చిన్నగా, ఎర్రగా కందినట్టు ఉంటుంది. అప్పుడు దాన్ని చూసే చెప్పవచ్చు, అక్కడ మొటిమ రాబోతుందని. అయితే ఇలా వచ్చే మొటిల్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెల్లని పుసి వంటి పదార్థంతో కూడుకుని ఉంటాయి, కొన్ని బ్లాక్ హెడ్స్, కొన్ని వైట్ హెడ్స్ రూపంలో ఉంటాయి, మరికొన్ని చర్మం అంతర్భాగంలోనే ఉండి పైకి ఉబ్బినట్టు కనిపిస్తాయి.
ఇంకా కొన్ని ముందు చెప్పినట్టుగా పుసి కాకుండా తెల్లని పదార్థంతో ఉంటాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న గడ్డల్లా వస్తాయి. అయితే మొటిమలు ఎలా వచ్చినా వాటిని చిదమకూడదు, నలపకూడదు. లేదంటే అవి ఉన్న ప్రదేశంలో చర్మం ఇంకా కందిపోయి, వాస్తుంది. ఎర్రగా అయి దురద పెడుతుంది. దద్దుర్లు కూడా వస్తాయి. క్రమంగా అది కొన్ని సార్లు పుండుగా మారేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలిసిందే. అప్పుడు ముఖం శాశ్వతంగా తన అందాన్ని కోల్పోతుంది. కనుక మొటిమలను చిదమకూడదు, నలపకూడదు. వీలైనంత వరకు అలాగే వదిలేయాలి. లేదంటే కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటిస్తే మొటిమలను దూరం చేసుకోవచ్చు..!
బెంజైల్ పెరాక్సైడ్… దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల్లో వాడుతున్నారు. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడం వల్ల చర్మానికి మేలు చేస్తుంది. ఇందులోని పెరాక్సైడ్ బాక్టీరియా క్రిములను చంపడమే కాదు, చర్మం సురక్షితంగా ఉండేలా చేస్తుంది. బెంజోయిక్ యాసిడ్ క్రిములకు, ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందువల్ల చర్మంపై ఉన్న మొటిమలు ఇట్టే తొలగిపోతాయి. టీ ట్రీ ఆయిల్‌ను నిత్యం మొటిమలపై రాస్తుంటే దాంతో కొద్ది రోజుల్లో మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. అయితే దీనికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఫలితాలు చాలా బాగుంటాయి. టీ ట్రీ ఆయిల్‌లో బాక్టీరియాలను నాశనం చేసే గుణాలు మెండుగా ఉన్నాయి.
ఒక భాగం యాపిల్ సైడర్ వెనిగర్‌కు 3 భాగాల నీరు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని రాత్రి పూట పడుకునే ముందు మొటిమలపై అప్లై చేయాలి. ఉదయాన్నే కడిగాక, ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తున్నా మొటిమలు పోతాయి. అరటి పండు తొక్కను తీసుకున దాని లోపలి భాగాన్ని ముఖంపై మసాజ్ చేసినట్టు అప్లై చేయాలి. అనంతరం 30 నిమిషాల పాటు వేచి ఉన్నాక ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు పోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది.