నోటిపూత సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు..!

శరీరంలో పోషకాహార లోపం ఏర్పడడం, జీర్ణ సమస్యలు, ఇంకా పలు ఇతర కారణాల వల్ల మనలో చాలా మందికి నోటి పూత సమస్య వస్తుంటుంది. నోట్లో నాలుకతోపాటు పెదవుల లోపలి వైపు, ఇతర భాగాల్లో పొక్కులు, పూత ఏర్పడుతాయి. దీంతో నాలుక ఎర్రగా అయి పగిలినట్లు అవుతుంది. దీంతో తిన్న ఆహారం రుచి సరిగ్గా తెలియదు. అలాగే కారం, మసాలాలు వంటి పదార్థాలను తినలేరు. అయితే నోటిపూతను తగ్గించుకునేందుకు పలు సహజసిద్ధమైన చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే…

home remedies for mouth ulcers

1. బియ్యాన్ని కడిగిన నీటిలో కొద్దిగా కలకండ్‌ కలిపి రోజుకు రెండు సార్లు 30 ఎంఎల్‌ మోతాదులో తాగాలి. నోటిపూత తగ్గుతుంది.

2. జాజికాయను పాలలో అరగదీసి వచ్చే మిశ్రమాన్ని నాలుకపై పూయాలి. ఇలా నాలుగైదు రోజుల పాటు చేస్తే సమస్య నుంచి బయట పడవచ్చు.

3. పటిక బెల్లాన్ని నీటిలో కలిపి పలుచని ద్రావణాన్ని తయారు చేయాలి. దీన్ని నోట్లో పోసుకుని బాగా పుక్కిట పట్టాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.

4. నోటి పూత, పొక్కులు ఉన్న చోట ఆవు నెయ్యి రాస్తుంటే సమస్య తగ్గుతుంది.

5. చిన్న పిల్లల్లో నోటి పూత వస్తే ఉసిరికాయను నూరి మెత్తగా ముద్దలా చేసి అందులో చనుబాలు కలిపి నోట్లో పూత ఉన్న చోట రాయాలి. ఫలితం ఉంటుంది.

6. కొత్తిమీరను ముద్దగా నూరి దాన్ని ఒక గ్లాస్‌ నీటిలో బాగా కలిపి కషాయం తయారు చేయాలి. మిశ్రమం సగం మిగిలే వరకు కషాయం కాయాలి. దాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. నోటిపూత, కురుపులు తగ్గుతాయి.

నోటిపూత సమస్య ఉన్నవారు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని కొన్ని రోజుల పాటు తీసుకోవాలి. నెయ్యి, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. బ్రౌన్‌ రైస్‌ను తినాలి. మాంసాహారాన్ని తగ్గించాలి. కారం, పులుపు, ఉప్పులను కొన్ని రోజులు తక్కువగా తినాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఆహారం తిన్నాక కచ్చితంగా నోటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే భోజనం చేశాక తమలపాకులను నేరుగా నమిలి తినాలి. దీంతో నోటిపూత తగ్గుతుంది. ఇక కొందరిలో టూత్‌ పేస్ట్‌ లేదా పొడి పడదు. అలాంటి వారు పేస్ట్‌ను మార్చి చూస్తే ఫలితం ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts