గ్యాస్ సమస్య చాలా బాధాకరం. మనం తీసుకునే ఆహారం, లేదా ఆహారం తీసుకునే సమయం లేదా ఇతర జీవన విధానాలు సరిలేకున్నా గ్యాస్ సమస్య వచ్చి తీరుతుంది. బిజీ జీవితంలో అందుబాటులో వున్న ఏదో ఒక ఆహారాన్ని తినేయటం రోజు గడిపేయటం జరుగుతుంది. దీని ప్రభావం జీర్ణ వ్యవస్ధపై పడటం, గ్యాస్ ఏర్పడటం, భరించలేని పొట్టనొప్పి రావడం దానికిగాను మందులు వేయడం జరుగుతూనే వుంటుంది. భరించలేని ఈ నొప్పి వచ్చినపుడు సహజపద్ధతులద్వారా దానిని ఎలా నివారించుకోవాలనేది పరిశీలిద్దాం.
చల్లటి పరిశుభ్రమైన నీటిని అధికంగా తాగండి. ఐస్ క్రీములు లేదా చల్లటి పాలు కూడా భరించలేని ఈ నొప్పికి ఉపశమనం కలిగిస్తాయి. నొప్పి వచ్చినపుడు పొట్టభాగ పై హీటింగ్ ప్యాడ్ వుంచండి. కొద్దిపాటి వేగవంతమైన నడక లేదా జోగింగ్ చేయండి. మసాలా, నూనె కల తిండిపదార్ధాలు తినకండి. తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలు తీసుకోండి. కొబ్బరి నీరు, నిమ్మనీరు, జలజీరా వంటి నీళ్ళు నొప్పి తగ్గేందుకు సహకరిస్తాయి. జీలకర్రను వేడినీటితో కలిపి నమిలి తింటే నొప్పి తగ్గుతుంది.
అజీర్ణం కారణంగానే గ్యాస్ ఏర్పడుతుంది. అధిక ఆహారం ఈ సమస్యనిస్తుంది. కనుక కొద్దిపాటి ఆహారం తీసుకోండి. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నములుతూ తినండి. ఎక్కువ సార్లు తక్కువ మొత్తం ఆహారాన్ని భుజించండి. పచ్చళ్లు, కాఫీ, పొగతాగటం, మింట్, ఆల్కహాల్ మొదలైనవి సమస్యను మరింత పెంచుతాయి. వేళకు తినండి. ఒకే వేళకు తింటే గ్యాస్ నొప్పి రాదు. రాత్రి వేళ పడకకు కనీసం మూడు లేదా నాలుగు గంటల ముందు భోజనం చేయండి. నూనె పదార్ధాలను తినకండి. కొద్దిపాటి శారీరక వ్యాయామం చేయండి. ఈ సహజ మార్గాలను ఆచరిస్తూ గ్యాస్ బాధను నివారించుకోవచ్చు.