Kadupulo Nuli Purugulu : మనలో చాలా మంది కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యను మనం ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము. కడుపులో నులి పురుగుల వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యకిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషితమైన ఆహారాన్ని, నీటిని తీసుకోవడం, శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, సరిగ్గా ఉడకని మాంసాన్ని, ఆహారాన్ని తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత కడుపులో నులి పురుగుల సమస్య తలెత్తుతుంది. ఈ పురుగులు మన పొట్టలో, ప్రేగులో నివాసాన్ని ఏర్పరుచుకుని మనం తీసుకునే ఆహారం నుండి పోషకాలను గ్రహించి మన శరీర అనారోగ్యానికి కారణమవుతాయి.
అయితే మనలో చాలా మందికి కడుపులో పురుగులు ఉన్నాయన్నా సంగతే తెలియదు. అనారోగ్యానికి గురి అయినప్పటికీ కారణమే తెలియక ఇబ్బందిపడుతూ ఉంటారు. సాధారణంగా కొన్ని లక్షణాలను బట్టి మనం కడుపులో నులి పురుగులు ఉన్నాయని గుర్తించవచ్చు. కడుపులో నులి పురుగులు ఉన్నవారు బలహీనంగా, నీరసంగా తయారవుతారు. అలాగే వారిలో పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా కడుపులో నొప్పి, వాంతులు, వికారం, కడుపు ఉబ్బరం, దగ్గు వంటి లక్షణాలు కూడా కనబడతాయి. కడుపులో నులి పురుగులను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. లేదంటే మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కడుపులో నులిపురుగులను తొలగించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో పచ్చి బొప్పాయి పేస్ట్ ను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె వేసి కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని వారం రోజుల పాటు రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు తొలగిపోతాయి. అలాగే పాలల్లో ఒక టీ స్పూన్ పసుపును కలిపి రోజూ తాగాలి. పసుపులో ఉండే ఔషధ గుణాలు పురుగులను నివారించడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే కడుపులో నులిపురుగులను నివారించడంలో గుమ్మడికాయ గింజలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలకు పరాన్నజీవులను నశింపజేసే లక్షణం ఉంటుంది.
కనుక గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను వేయించి తీసుకోవాలి. ఈ గింజలను అర కప్పు నీళ్లు, కొబ్బరి పాలతో కలిపి వారానికి ఒకసారి పరగడుపున తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగులు నశిస్తాయి. అదే విధంగా కడుపులో నులిపురుగులతో బాధపడే వారు వారం రోజుల పాటు పరగడుపున వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ వేపాకు పేస్ట్ ను కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా కడుపులో నులిపురుగులు నశిస్తాయి.
అదే విధంగా ఒక గ్లాస్ నీటిలో 3 లవంగాలను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా వారానికి 3 నుండి 4 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో పురుగుల సమస్యతో బాధపడే వారు రోజూ ఒక క్యారెట్ ను బాగా నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల కూడా కడుపులో పురుగులు నశిస్తాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును అల్పాహార సమయంలో తీసుకోవాలి. ఇది తీసుకున్న 3 గంటల తరువాత ఒక గ్లాస్ వేడి పాలల్లో 2 టేబుల్ స్పూన్ల మజ్జిగను కలిపి తాగాలి. ఇలా వారం రోజుల పాటు తాగడం వల్ల కడుపులో పురుగులన్నీ నశిస్తాయి.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూన్ వామును నమిలి తినాలి. దీనిని తీసుకున్న అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా రెండు వారాల పాటు చేయడం వల్ల కడుపులో పురుగులన్నీ నశిస్తాయి. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా వారం రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపులో పురుగులు నశిస్తాయి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల మన కడుపులో ఉండే అన్ని రకాల పురుగులు నశిస్తాయి. మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి.