Mouth Ulcer Home Remedies : మనల్ని వేధించే నోటి సమస్యల్లో నోటిపూత కూడా ఒకటి. నోటిపూత, నోటిలో పుండ్లు వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇవి కొందరిలో తరుచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి కారణంగా మనం సరిగ్గా ఆహారాన్ని కూడా తీసుకోలేము. నోటి పూత కారణంగా ఆహారం తీసుకునే సమయంలో విపరీతమైన బాధ కలుగుతుంది. నోటిపూతకారణంగా కారం, మసాలా ఉండే పదార్థాలను తినలేము. నీటిని తాగిన కూడా విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది. సాధారణంగా నోటిపూత దానంతట అదే తగ్గుతుంది. కొందరు ఆయింట్ మెంట్ లను వాడుతూ ఉంటారు. ఆయింట్ మెంట్ లతో పాటు కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల నోటిపూత, నోటిలో పుండ్ల సమస్య నుండి చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. నోటిపూత తీవ్రతను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిపూత సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత ఈ నీటిని నోట్లో పోసుకుని అర నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా రోజుకు 3 నుండి 4 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల నోటిపూత సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే నోటిలో పుండ్లు, నోటిపూతపై తేనె రాయాలి. తేనెను రాయడం వల్ల మంట, నొప్పి తగ్గుతుంది. అలాగే నోటిపూతతో బాధపడే వారు కొబ్బరి నూనెను వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రో బయాల్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పుండ్లను తగ్గించడంలో సహాయపడతాయి. నోటిపూతతో బాధపడే వారు కొబ్బరి నూనెను నేరుగా పుండ్లపై రాయవచ్చు లేదా కొబ్బరి నూనెను నోట్లో పోసుకుని ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు. ఎలా చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది.
అలాగే నోటి అల్సర్లను, నోటిపూతను తగ్గించడంలో బేకింగ్ సోడా కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది. బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను నోట్లో అల్సర్లపై రాసి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నోటిపూత త్వరగా తగ్గుతుంది. అలాగే నోటి పుండ్లపై దూదితో లవంగం నూనెను రాయాలి. ఇలా రాయడం వల్ల నొప్పి తగ్గుతుంది. అలాగే ఆ భాగంలో ఉండే ఇన్పెక్షన్ కూడా తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటిస్తూనే నోటిపూత, నోటిలో పుండ్లు, నోటి అల్సర్ వంటి సమస్యలతో బాధపడే వారు ఉప్పు, కారం, మసాలాలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. చప్పటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మింగడానికి వీలుగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అదే విధంగా నీటిని ఎక్కువగా తాగాలి. ఈ సమస్య రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.