Padala Pagullu : మనలో చాలా మంది పదాల పగుళ్లతో బాధపడుతూ ఉంటారు. పాదాల పగుళ్లు నొప్పిని కూడా కలిగిస్తూ ఉంటాయి. మనలో చాలా మంది పాదాల పగుళ్ల కారణంగా నడవడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. పాదాలు పగళ్లడానికి అనేక కారణాలు ఉంటాయి. పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పాదాలపై మృతకణాలు పేరుకుపోవడం, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, శరీరం డీహైడ్రేషన్ కు గురి కావడం వంటి, పాదాలపై చర్మం పొడిబారడం వంటి వివిధ కారణాల చేత పాదాల పగుళ్లు ఏర్పడతాయి. చాలా మంది ఈ పగుళ్లను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. ఎటువంటి క్రీములు వాడే అవసరం లేకుండా పాదాల పగుళ్లను కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు.
పాదాల పగుళ్లను తగ్గించే ఆ చిట్కా ఏమిటి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక టీ స్పూన్ ఆవనూనెను, ఒక టీ స్పూన్ పెట్రోలియం జెల్లీని, 2 కర్పూరం బిళ్లలను, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఆవనూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేసుకోవాలి. తరువాత కొబ్బరి నూనె, పెట్రోలియం జెల్లీ వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు రాసుకునే ముందు పాదాలను నీటిలో నానబెట్టి శుభ్రం చేసుకోవాలి. తరువాత తడి పోయేలా తుడుచుకుని ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని మర్దనా చేసుకోవాలి.
తరువాత పాదాలకు సాక్స్ లు వేసుకుని నిద్రించాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల తగినంత తేమ లభించి పాదాల పగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మెత్తగా, మృదువుగా తయారవుతుంది. ఈ చిట్కాను పాటిస్తూనే పాదాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం మన పాదాల పగుళ్లను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.