Chicken Fried Rice : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే పదార్థాల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి. చికెన్ తో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా దీనిని తింటారు. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేయడం చాలా సులభం. దీనిని ఎవరైనా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – పావు కిలో, అల్లం వెల్లుల్లి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్లు – 2, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – ఒక టీస్పూన్, చిన్నగా తరిగిన బీన్స్ – 5, చిన్నగా తరిగిన చిన్న క్యారెట్ – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – పావు టీ స్పూన్, బాస్మతీ అన్నం – 200 గ్రా., మిరియాల పొడి – ఒక టీ స్పూన్, చికెన్ మసాలా – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – పావు కప్పు.
చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప చికెన్ ఫ్రైకు కావల్సిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.నూనె వేడయ్యాక కోడిగుడ్లను వేసుకోవాలి. ఈ కోడిగుడ్లను రెండు నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత కలుపుతూ ముక్కలుగా చేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తరువాత క్యారెట్, బీన్స్, క్యాప్సికం తరుగు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన చికెన్, కోడిగుడ్లు వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత అన్నంతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ప్రైడ్ రైస్ తయారవుతుంది. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.