Potato Fingers : మనం బంగాళాదుంపలతో వంటలతో పాటు రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ చిరుతిళ్లను ఎవరైనా తేలికగా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో పొటాటో ఫింగర్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఈ పొటాటో ఫింగర్స్ చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే పొటాటో ఫింగర్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 4, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పొటాటో ఫింగర్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను తురుముకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉంటే మరో టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి. ఇలా పిండిని తయారు చేసుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రెండు చేతులతో గుండ్రంగా,పొడవుగా ఫింగర్స్ ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా వత్తుకున్న ఫింగర్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొటాటో ఫింగర్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.