Cloves : వంటల తయారీలో మనం అనేక రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం. వాటిల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలను ఉపయోగించడం వల్ల వంటల వాసన, రుచి పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. లవంగాలలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. లవంగాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకుంటాయి. అంతేకాకుండా డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి.
తరచూ లవంగాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దగ్గు తగ్గకుండా బాధిస్తున్నప్పుడు లవంగ మొగ్గను నోట్లో పెట్టుకుని రసం మింగుతూ ఉంటే దగ్గు నుండి ఉపశమనం కలగడమే కాకుండా బొంగురు గొంతు కూడా సరిగ్గా అవుతుంది. దంతాల నొప్పులను, నోటి దుర్వాసనను తగ్గించడంలో కూడా లవంగాలు మనకు ఉపయోగపడతాయి. దంతాల వాపు, చిగుళ్ల నొప్పితో బాధపడుతున్నప్పుడు లవంగం నూనెలో దూదిని ముంచి నొప్పి ఉన్న అద్దితే మంచి ఫలితం ఉంటుంది.
గుండెలో మంటతో బాధపడుతున్నప్పుడు రెండు లవంగాలను, పంచదారను కలిపి దంచి ఈ మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని తాగడం వల్ల గుండెల్లో మంట నుండి ఉపశమనం కలుగుతుంది. గోరు వెచ్చని నీటిలో లవంగం నూనెను కలిపి తాగడం వల్ల జలుబు తగ్గుతుంది. నీటిలో లవంగాలను వేసి మరిగించాలి. ఈ నీటిని వడకట్టుకుని తాగడం వల్ల అజీర్తి, వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. వీటిలో ఉండే రసాయనాలు పెద్ద ప్రేగులో ఉండే పరాన్న జీవులను నాశనం చేయడంలో సహాయపడతాయి. దీంతో కడుపులో నులి పురుగులు, డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి.
పాలలో లవంగం పొడి, ఉప్పు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. గర్భిణీలు, అల్సర్, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వాటితో బాధపడే వారు లవంగాలను ఎక్కువగా వాడకూడదు. లవంగాలను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లవంగాలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మూత్ర పిండాల సమస్యలతోపాటు కాలేయ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక లవంగాలను తగిన మోతాదులో ఉపయోగించి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.