Vamu Water For Snoring : మనల్ని వేధిస్తున్న సమస్యల్లో గురక కూడా ఒకటి. ఇది ఒక సాధారణమైన సమస్య. గురక కారణంగా గురక పెట్టే వారే కాకుండా వారి చుట్టు పక్కల ఉన్న వారికి కూడా నిద్ర లేకుండా పోతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. నిద్రిస్తున్న సమయంలో గాలి తీసుకునేప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తటి భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. గాలి అధికమయ్యే కొద్ది ధ్వని కూడా అధికమవుతుంది. నిద్రించే సమయంలో నోరు, ముక్కు ద్వారా గాలి సులభంగా పోకపోవడమే వల్ల అది గురకకు కారణం అవుతుంది. హైపర్ థైరాయిడిజం, స్థూలకాయం, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో, మద్యపానం చేసే వారిలో, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.
కొన్నిసార్లు శరీరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా గురక వస్తుంది. రక్తపోటు, గుండె వ్యాధి వంటి సమస్యలు ఉన్నా కూడా గురక వస్తుంది. కొన్ని చిట్కాలను ఉపయోగించి సహజంగా మనం గురక సమస్య నుండి బయటపడవచ్చు. నిద్రపోవడానికి మూడు గంటల ముందు మద్యం తాగకూడదు. అలాగే వెల్లకిలా పడుకోవడం వల్ల గురక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక గురక ఎక్కువగా వస్తున్నప్పుడు పక్కకు తిరిగి పడుకోవాలి. ముక్కును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అదే విధంగా పడుకునే మంచం కింద తలవైపు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పడుకునే ముందు నీటిలో యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా గురక రాకుండా ఉంటుంది. అలాగే గురక సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రాణాయామం వంటివి చేస్తూ ఉండాలి. అలాగే వీలైనంత త్వరగా బరువు తగ్గాలి. ఈ చిట్కాలను పాటిస్తూనే నిద్రించే ముందు ఆవు నెయ్యిని కొద్దిగా వేడి చేసి రెండు చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి.
అదే విధంగా ఈ నెయ్యిని అరి చేతులు, అరి కాళ్లల్లో రాసుకుని మర్దనా చేయాలి. అలాగే గురకను తగ్గించడంలో వాము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిద్రించే ముందు వాముతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల కూడా గురక సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే కొన్నిసార్లు గాలిలో ఉండే దుమ్ము, ధూళి కూడా గురకకు కారణమవుతాయి. కనుక మనం నిద్రించే గది కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. గదిలో ఎయిర్ ఫ్యూరీ ఫైయర్ లను ఉంచుకోవాలి. అదే విధంగా పడుకునే ముందు గోరు వెచ్చని నీటిలో యాలకుల పొడి వేసి తాగాలి. యాలకుల పొడి గొంతు తడి ఆరిపోకుండా చేస్తుంది. ఈ చిట్కాలను పాటించినప్పటికి గురక తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.