మనల్ని వేధించే జీర్ణసంబంధిత సమస్యల్లో అల్సర్లు కూడా ఒకటి. ఈ అల్సర్లు రావడానికి ప్రధాన కారణం హెలికోబాక్టర్ ఫైలోరి ( హెచ్. ఫైలోరి) అనే బాక్టీరియా. ఈ బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ ల కారణంగా జీర్ణాశయంలో అల్సర్లు వస్తాయి. ఈ సమస్య బారినపడినప్పుడు కడుపులో మంట, కడుపు ఉబ్బరం, అసిడిటీ, తల తిరిగినట్టు ఉండడం, వికారం, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అల్సర్ల సమస్యను నిర్లక్ష్యం చేసిన కొద్దీ అవి తీవ్రరూపం దాల్చి క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్సర్ల సమస్య నుండి బయట పడడానికి వైద్యున్ని సంప్రదించకుండానే మార్కెట్ లో దొరికే వివిధ రకాల సిరప్ లను, మందులను వాడుతూ ఉంటారు.
వీటిని వాడడం వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ అల్సర్ల సమస్య తక్కువగా ఉన్నప్పుడు దానిని ఇంటి చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. సమస్య మరీ తీవ్రతరంగా ఉంటే మాత్రం వెంటనే కచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి. ప్రారంభ దశలో ఉన్న అల్సర్లను నయం చేసే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో అల్సర్లతో బాధపడే వారు ముందుగా ఒక గ్లాస్ లో చిలికిన పెరుగును రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ వాము పొడిని, రుచికి తగినంత నల్ల ఉప్పును వేసి బాగా కలపాలి.
తరువాత ఇందులో గ్లాస్ నీటిని పోసి మజ్జిగలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మజ్జిగను వెంటనే తాగాలి. ఇలా తయారు చేసుకున్న మజ్జిగను సమస్య తీవత్రను బట్టి ఒక పూట నుండి రోజుకు మూడు పూటల చొప్పున తీసుకోవచ్చు. ఈ మజ్జిగను క్రమం తప్పకుండా వారం రోజుల పాటు తాగడం వల్ల అల్సర్ల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కాను పాటించినప్పటికీ సమస్య తగ్గు ముఖం పట్టకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.