Pooja Room : హిందువులు తమ ఇష్టదైవాన్ని ఫోటోల రూపంలో తమ ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ ఉంటారు. అయితే ఏ దేవుడిని పడితే ఆ దేవుడి ఫోటోను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోకూడదని శాస్త్రం చెబుతోంది. అసలు మన ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన దేవుడి పటాలు ఏమిటి.. ఎలాంటి పటాలు ఇంట్లో ఉండకూడదు.. దేవుడి ఫోటోలు పాడైతే ఏం చేయాలి.. వంటి తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండాల్సిన మొట్ట మొదటి ఫోటో పంచముఖ ఆంజనేయ స్వామి. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల భూత ప్రేత పిశాచ భయాలన్నీ పటాపంచలవుతాయి. స్వామి వారి ఫోటో ఇంట్లో ఉన్నంత కాలం నరఘోష, చెడు ప్రయోగాలు ఇంటి మీద ఎంత మాత్రం పనిచేయవు.
పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పంచముఖాలకు ఒక్కో విశిష్టత ఉంటుంది. తూర్పు ముఖంగా ఉండే హనుమంతుడు పాపాలను హరించి ఇష్ట సిద్ధిని కలిగిస్తాడు. మిగిలిన ముఖాలలో నారసింహుడు అభిష్ట సిద్ధిని ప్రసాదిస్తుండగా గరుడుడు సమస్త కష్టాలను తొలగిస్తాడు. కుడి వైపున చివరన ఉండే వరాహ మూర్తి సిరిసంపదలను, అలాగే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని, చక్కటి బిడ్డలను కలగజేస్తాడు. ఇంత విశిష్టత కలిగిన పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిరోజూ పవిత్రంగా ధూపాన్ని వేసి ఎర్రటి పుష్పాన్ని స్వామి వారికి సమర్పించి పూజిస్తూ ఉంటే ఇళ్లు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో సంతోషంగా ఉంటుంది.
ఇక ఇంట్లో ఉండాల్సిన మరో ఫోటో అర్థనారీశ్వర రూపం. ఈ రూపం భార్యా భర్తల అనోన్యానికి ప్రతీక. అర్థనారీశ్వరుని ఫోటోను ఇంట్లో ఉంచుకుని శివుడు ఉన్న వైపు తెల్లటి పుష్పాన్ని, పార్వతీదేవి వైపు ఎర్రటి పుష్పాన్ని ఉంచి పూజ చేస్తే ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా సంసార జీవితాన్ని గడుపుతారట. ఇక ఇంట్లో ఉండాల్సిన మరో ఫోటో శ్రీరామ పట్టాభిషేకం. ఈ పటంలో సీతారాములతోపాటు లక్ష్మణ, భరత, శత్రఘ్నులు, హనుమంతుడు సకల పరివారం కొలువు ఉంటారు. ఈ ఫోటోను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం ఇంటి మీద కలుగుతుందట.
అలాగే ఇంట్లో ఉండాల్సిన నాలుగవ ఫోటో లక్ష్మీ దేవి. లక్ష్మీ దేవి సిరిసంపదలకు, సౌభాగ్యాలకు, ధైర్య సాహసాలకు అధిష్టాన దేవత. లక్ష్మీదేవి ఆకుపచ్చ చీరలో సరోవరంలో పద్మాసనంపైన కూర్చుని నాలుగు చేతులతో ఎలాంటి ఆయుధం లేకుండా అభయ హస్తం చూపిస్తుండగా ఆమె వెనుక ఐరావతారాలు బంగారు కలశాలతో అభిషేకం చేస్తున్న ఫోటోను ఇంట్లో ఉంచుకుని పూజిస్తే ఇంట్లో ధనానికి కొదువ ఉండదు. అదే విధంగా ఇంట్లో ఉండాల్సిన మరో ఫోటో లక్ష్మీ నరసింహ రూపం. నరసింహ స్వామి స్వరూపం విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటి. ఇంట్లో ఉగ్ర నరసింహ స్వామిని కాకుండా శాంత స్వభావంగా ఉండే స్వామి పటాన్ని ఉంచుకుని ఎర్రటి పుష్పం ఉంచి ధూపం వేసి ప్రతిరోజూ పూజిస్తూ ఉంటే శత్రుభయాలన్ని తొలగిపోతాయి.
ఇక ఇంట్లో కాలభైరవుడు, శనిభగవానుడు, నృత్యం చేస్తున్న నటరాజ స్వామి, ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి, దుర్గామాత ఫోటోలను ఉంచుకోకూడదట. అలాగే చాలా మంది పూజ గదిలో శివలింగాన్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇంట్లో పూజించే శివలింగం ఎప్పుడూ బొటన వేలు సైజుకు మించి ఉండకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో పాడైపోయిన, చిరిగిపోయిన దేవుడి ఫోటోలను ఏం చేయాలా అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. కొందరూ ఆ ఫోటోలను దేవాలయాల్లోనూ, చెట్టు కింద పెట్టి వచ్చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దేవుడి ఫోటోలను ప్రవహిస్తున్న నదిలో నిమర్జనం చేయాలి. అలా లేకుంటే అగ్నిని వెలిగించి ఫోటోకు ఉన్న అద్దం, మేకులు తొలగించి అగ్ని దేవుడికి నమస్కారం చేస్తూ గచ్చగచ్చ సురశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర అనే మంత్రాన్ని జపిస్తూ అగ్నికి ఆహుతి చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి అరిష్టాలు రావు.