రైలు టిక్కెట్లను రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు సహజంగానే మనకు బెర్త్ కన్‌ఫాం అయితే కన్‌ఫాం అని స్టేటస్ వస్తుంది. లేదా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అయితే వెయిటింగ్ లిస్ట్‌లో మనకు PQWL, RLWL, GNWL, RLGN, RSWL, CKWL, RAC అనే పదాలు కనిపిస్తుంటాయి. వీటి గురించిన వివరాలను, వీటి అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
GNWL: General Waiting List (GNWL). రైలు టిక్కెట్లను మనం బుక్ చేసినప్పుడు సహజంగానే ఇలా పదం కనిపిస్తే మనకు బెర్త్ కన్‌ఫాం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైలు మొదలయ్యే స్టేషన్ లేదా దాని రూట్‌లో ఉన్న ఏదైనా స్టేషన్ నుంచి మనం టిక్కెట్లను బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే ఇలా మనకు చూపిస్తుంది.
RLWL: Remote Location Waiting List (RLWL). రైలు టిక్కెట్లను బుక్ చేశాక వెయిటింగ్ లిస్ట్‌లో ఇలా స్థితి వస్తే ఈ టిక్కెట్లు కన్‌ఫాం అయ్యేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. రైలు వెళ్లే మార్గంలో ఏదైనా ఒక స్టేషన్‌లో బెర్త్‌లు ఖాళీ అయ్యేలా ఉంటే ఇలా చూపిస్తుంది. ఇందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.
PQWL: A Pooled Quota Waiting List (PQWL). ఒక ట్రెయిన్‌కు కేవలం ఒక పూల్డ్ కోటా మాత్రమే ఉంటుంది. ఇందులో భాగంగా రైలు మొదలయ్యే, రైలు నిలిచిపోయే స్టేషన్‌లకు టిక్కెట్లను ఇస్తారు. లేదా రైలు నిలిచిపోయే స్టేషన్‌కు ఒకటి రెండు స్టేషన్ల ముందు వరకు కూడా వీటిని ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మార్గం మధ్యలో ఉన్న రెండు స్టేషన్లకు కూడా ఈ లిస్ట్‌ను చూపిస్తారు. అనేక స్టేషన్లలో బెర్త్‌లు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే ఒకే పూల్డ్ కోటాలో చూపిస్తారు. ఇవి కూడా కన్‌ఫాం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
RLGN: Remote Location General Waiting List (RLGN). RLWL లో ఉన్న టిక్కెట్లను కొన్ని సార్లు ఈ విధంగా కూడా చూపిస్తారు.
RSWL: Roadside Station Waiting List (RSWL). రోడ్డు పక్కనే ఉండే రైల్వే స్టేషన్లలో ఏవైనా బెర్త్ లు రైలులో ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే ఇలా చూపిస్తారు. ఇవి కూడా కన్‌ఫాం అయ్యే అవకాశాలు తక్కువే.
RQWL: Request Waiting List (RQWL). మార్గ మధ్యలో ఉండే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్‌కు టిక్కెట్‌ను బుక్ చేస్తే అది జనరల్ కోటాలో లేదా రిమోట్ లొకేషన్ లేదా పూల్డ్ కోటాలో చూపించబడకపోతే దాన్ని ఈ లిస్ట్‌లో చూపిస్తారు.
TQWL(formerly CKWL): గతంలో తత్కాల్ కోటాను CKWL ఈ విధంగా చూపించేవారు. దాన్ని TQWL గా మార్చారు.
RAC: ఈ లిస్ట్‌లోని టిక్కెట్లు కన్‌ఫాం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్ఏసీలో ఉంటే చాలా వరకు టిక్కెట్లు జర్నీలో కన్‌ఫాం అయిపోతాయి. ట్రెయిన్ టిక్కెట్ బుక్ చేశాక రైలులో ప్రయాణించకున్నా లేదా టిక్కెట్లను క్యాన్సిల్ చేసినా ఆ బెర్త్‌లను ఆర్ఏసీ వారికి ముందుగా కేటాయిస్తారు. కనుక ఈ కోటాలో టిక్కెట్లు చాలా త్వరగా, ఎక్కువగా కన్‌ఫాం అయ్యే అవకాశాలు ఉంటాయి.