దేశంలోని పౌరులు ఎన్ని బ్యాంకు అకౌంట్లను అయినా కలిగి ఉండవచ్చు. మెయింటెయిన్ చేసే స్థోమత ఉండాలే కానీ ఎన్ని అకౌంట్లను అయినా ఓపెన్ చేయవచ్చు. అయితే బ్యాంకు అకౌంట్లలో మనం మెయింటెయిన్ చేసే డబ్బు మాట అటుంచితే మనం అకౌంట్‌లో డిపాజిట్ చేసే నగదుపైనే ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే బ్యాంకు అకౌంట్లలో నగదు డిపాజిట్‌పై ప్రత్యేక పరిమితులు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు మీ ఏదైనా బ్యాంకు అకౌంట్‌లో ఒకేసారి రూ.50వేలు అంతకన్నా ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే పాన్ కార్డును కచ్చితంగా సమర్పించాలి. రోజుకు మీరు ఒక అకౌంట్‌లో రూ.1 లక్ష వరకు నగదును డిపాజిట్ చేయవచ్చు. మీరు నగదును రెగ్యులర్ గా డిపాజిట్ చేయకపోతే అకౌంట్లలో ఒక రోజుకు రూ.2.50 లక్షల వరకు క్యాష్‌ను డిపాజిట్ చేసే అవకాశాన్ని పొందవచ్చు. మీ అన్ని బ్యాంకు అకౌంట్లలో కలిపి ఏడాదికి రూ.10 లక్షల కన్నా ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే అప్పుడు కచ్చితంగా మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి. లేదంటే ఐటీ శాఖ మీకు నోటీసులు జారీ చేస్తుంది.
రూ.10 లక్షల కన్నా ఎక్కువ నగదును మీరు డిపాజిట్ చేస్తే మీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కచ్చితంగా చెప్పాలి. అలా అయితే ఎంతైనా నగదును డిపాజిట్ చేయవచ్చు. అలా కాకుండా అక్రమ మార్గంలో వచ్చిన డబ్బు అని తేలితే ఆదాయపు పన్ను శాఖ మీ డబ్బులో 60 శాతం మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది. దీనిపై 25 శాతం సర్‌చార్జి, 4 శాతం సెస్‌ను కూడా వసూలు చేస్తారు. కనుక మీరు మీ బ్యాంకు అకౌంట్లలో ఎంత నగదును కలిగి ఉన్నప్పటికీ క్యాష్ డిపాజిట్ విషయంలో మాత్రం ఈ పరిమితులను తెలుసుకుని వ్యవహరించండి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.