నేటి తరుణంలో మన దేశంలో ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆయా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సెంట్రల్ ట్యాక్సులు, స్టేట్ ట్యాక్సులు కలిపి వాటి ధరలు రెట్టింపు మొత్తం పలుకుతున్నాయి. దీంతో జనాలకు అంత ధర వెచ్చి వాటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. అయితే అసలు పెట్రోల్, డీజిల్ ధరలను ఎవరు పెంచుతారు ? వాటిని పెంచే అధికారం ఎవరికి ఉంది ? వాటిపై ప్రభుత్వాలకు నియంత్రణ ఉండదా ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో పెట్రోల్, డీజిల్‌ను అమ్మేవి నాలుగు ప్రధాన కంపెనీలు. అవి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, రిలయన్స్ పెట్రోలియం సంస్థలు. గతంలో.. అంటే.. కేంద్రంలో యూపీఏ హయాంలో ఇంధన ధరలను ప్రభుత్వమే సవరించేది. పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో ఆ ధరలను నియంత్రించేవారు. అప్పట్లో వంట గ్యాస్‌కు సబ్సిడీ ఇచ్చినట్లే, పెట్రోల్, డీజిల్‌కు సబ్సిడీ ఇచ్చేవారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక సదరు సబ్సిడీని కట్ చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లను క్రమబద్దీకరించారు. దీంతోపాటు ఇంధన ధరలను పెంచుకునే అవకాశం ఆయా కంపెనీలకే ఇచ్చారు.
అలా బీజేపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో మొదట్లో ఆయిల్ కంపెనీలు రోజు వారీగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వచ్చాయి. కానీ దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుండడంతో ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి ధరలను సవరిస్తున్నారు. అయితే ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఆయిల్ కంపెనీలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్నాయే తప్ప తగ్గించడం లేదు. అందుకే ఎప్పటి కప్పుడు వాటి ధరలు పెరుగుతున్నాయి. మరి ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తిగా వస్తేనైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయో లేదో వేచి చూడాలి..!