అమెజాన్ అడవిని భూమికి ఊపిరితిత్తులని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రపంచానికి కావల్సిన ఆక్సిజన్‌లో 20% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 9 దేశాల్లో విస్తరించి ఉంది – ముఖ్యంగా బ్రెజిల్, పెరూ, కొలంబియా లాంటి దేశాల్లో ఎక్కువ భాగం ఉంది. అమెజాన్‌లో 40,000 కంటే ఎక్కువ మొక్కల జాతులు, 400కి పైగా పక్షుల జాతులు, 2.5 మిలియన్ల కీటకాల జాతులు ఉన్నాయి. జంతువులకు ఇది ఒక న్యాచురల్ హోం లాంటిది. ఇక్కడ సంవత్సరానికి దాదాపు 200 నుంచి 300 రోజులు వర్షం పడుతుంది. అందుకే దీనిని రెయిన్ ఫారెస్ట్ అంటారు.
అమెజాన్ నది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నది (నైల్ నది తర్వాత). దీని పొడవు దాదాపు 6,400 కిలోమీటర్లు. అమెజాన్ అడవిలో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి – అనకొండ, పిరానా, జాగ్వార్ లాంటివి ఉంటాయి. అనకొండ నేపథ్యంలో కొన్ని సినిమాలను కూడా తెరకెక్కించారు. అమెజాన్ అడవిలో ఇంకా కొన్ని గిరిజన జాతులు ఉన్నాయి. వాళ్లు ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి దూరంగా, తమ సంప్రదాయ జీవన శైలిలో జీవిస్తున్నారు.
దురదృష్టవశాత్తూ ప్రతి సంవత్సరం వేల ఎకరాల అడవి కనుమరుగవుతుంది – కార్బన్ ఉద్గారాలు, చెక్క కోసం, వ్యవసాయ పనుల కోసం అడవులను నరికేస్తున్నారు. అమెజాన్ అడవి ప్రపంచంలో నేచురల్ ఫోటోగ్రఫీకి, పరిశోధనలకు ఒక అద్భుతమైన ప్రదేశం. అక్కడికి వెళ్ళడం రావడం అంటే ఓ అడ్వెంచర్ చెయ్యడమే. అమెజాన్ అడవిలో ఇంకా కొన్ని ప్రదేశాల్లో మనిషి ఇప్పటికీ అడుగుపెట్టలేదు. ఈ అడవిలో ఇంకా ఎన్నో తెలియని జీవజాతులు, మరెన్నో రహస్యాలు ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు.