కొద్దిపాటి గుస గుసలు చేస్తూ వుంటే చాలు ఆరోగ్యం బ్రహ్మాండమట. గుసగుసలు, ఒత్తిడి, ఆందోళనలు దూరం చేయటమే కాక శరీరంలోని పాజిటివ్ హార్మోన్లను పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయని పరిశోధకులు చెపుతున్నారు. కాబట్టి గుస గుసలు ఏవైనా సరే…..పక్కింటి పిన్నిగారు లేచిపోయింది!…మూడో ఇంట్లో పిల్ల పెళ్ళి ఆగిపోయింది! లేదా వాళ్ళ అబ్బాయి రౌడీ షీటర్, రోజూ తాగి ఇంటికి వస్తాడట….! లాంటి గుసగుసలు ప్రత్యేకించి మహిళలనుండే వస్తాయని, మహిళలలో పదిమందిలో కనీసం ఒక్కరు కూడా రహస్యం దాచుకోలేక, ఇటువంటి గుస గుసలకు పాల్పడతారని, అయితే ఇవి ఆరోగ్య రీత్యా మంచివేనని ఇవి శరీరంలోని పాజిటివ్ హార్మోన్ సెరోటోనిన్ లెవెల్ పెంచి ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తాయని సైకాలజిస్టు కోలిన్ గిల్ తన పరిశోధనలో వెల్లడించినట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.
ఈ రకంగా ఎదుటివారి గురించి మాట్లాడుకునేటపుడు, వారితో ఒక బంధం ఏర్పరచుకుంటూ సంతోషపడుతూ శరీరంలోని ఫీల్ గుడ్ రసాయనాలు రిలీజ్ చేసుకుంటామట. అంతేకాదు, గాసిపింగ్ లో ఒక్కోసారి పెద్దగా నవ్వేసుకోడం బ్రెయిన్ లో సంతోషాన్ని కలిగించి కొన్ని కండరాలకు మంచి చేస్తుందట. గాసిప్ అనేది మనలో ఇతరుల ప్రవర్తనపై సమాచారం సేకరించే అలవాటు కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది మనం మరల అబద్ధాలు చెప్పేవారుగాను, మోసం చేసేవారుగాను అవటానికి వీలు లేకుండా చేస్తుందట.
అంతేకాదు, ఈ గాసిప్ చేసే వారు కోతులు గుంపులుగా కూర్చొని తమ బొచ్చులోని పేలు తీసుకుంటున్నట్లు, కొన్ని గ్రూపుల్లో బాగా ఇమిడిపోయి మరింత ఆనందం పొందుతూంటారని పరిశోధకులు వెల్లడించారు. కనుక మహిళలే కాదు, పురుషులు సైతం ఇకపై మరిన్ని గ్రూపులుగా ఏర్పడి గాసిప్ కొనసాగిస్తే…ఎంత ఆనందం… ?