అరటిపండు… పేదల నుంచి ధనికుల వరకు అందరికీ, అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే పండు. తక్కువ ధరే అయినా ఈ పండుతో మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో. గ్లూకోజ్, సూక్రోజ్, ఫ్రక్టోజ్, పొటాషియం, ఫైబర్ అనే ముఖ్యమైన పోషకాలు అరటి పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అరటి పండులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. పలు అనారోగ్యాలకు ఈ పండు ఔషధంలా పని చేస్తుంది. అయితే సాధారణంగా ఎవరైనా అరటి పండును మాత్రమే తిని తొక్కను పడేస్తారు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది తెలుసుకుంటే మీరు ఇక అరటి పండు తొక్కను కూడా పడేయరు. అంటే దాన్ని తినేందుకు కాదు సుమా! కాకపోతే ఆ తొక్కతో కూడా మనం పలు ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
దంతాల సంరక్షణకు అరటి పండు తొక్క బాగా ఉపయోగపడుతుంది. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రోజూ రుద్దాలి. కనీసం ఇలా వారం పాటు చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి. కాలిన గాయాలు, దెబ్బలకు అరటి పండు తొక్క ఔషధంగా పనిచేస్తుంది. సమస్య ఉన్న ప్రాంతంపై అరటి పండు తొక్కను ఉంచి కట్టు కట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒకటి, రెండు రోజుల్లోనే దెబ్బలు మానిపోతాయి. ముఖ సౌందర్యాన్ని పెంచుకునేందుకు కూడా అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. అంతేకాదు యాంటీ ఏజింగ్ గుణాలు కూడా అరటి పండు తొక్కలో ఉన్నాయి. దీని వల్ల వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతమవుతుంది. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అరగంట సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో పైన చెప్పిన చర్మ సమస్యలు పోతాయి. చర్మం ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
చర్మంపై ఏర్పడే దురదలు, మంటలను తగ్గించడంలోనూ అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది. సమస్య ఉన్న ప్రదేశంపై అరటి పండు తొక్కను రాసి 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దీంతో దురద, మంట తగ్గిపోతుంది. శరీరంలో ఏదైనా భాగం నొప్పిగా ఉంటే అక్కడ అరటి పండు తొక్కను కొద్ది సేపు మసాజ్ చేసినట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయమవుతుంది. పురుగులు, కీటకాలు కుట్టిన చోట దురదగా ఉన్నా అరటి పండు తొక్కను రాస్తే చాలు. వెంటనే ఉపశమనం కలుగుతుంది.