Silver Anklets : స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాల లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అందుకనే అమ్మాయిలు కచ్చితంగా పట్టీలను వేసుకోవాలని చెబుతుంటారు. ఇక అదే అలవాటు కొనసాగుతూనే ఉంటుంది.
అయితే పట్టీలు వెండితో చేసినవి మాత్రమే ఎందుకు ధరిస్తారు. అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వివాహ సమయంలో కూడా కాలి వేళ్ళకు మెట్టెలు తొడుగుతారు. అవి కూడా వెండివే ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పసిడితో చేసిన పట్టీలను వేసుకుంటున్నారు. అలా బంగారు పట్టిలు ధరించడం శుభప్రదం కాదంటున్నాయి శాస్త్రాలు. పురాణాల పరంగా కూడా దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
హిందూ పురాణాల ప్రకారం అయితే బంగారం అంటే లక్ష్మి. లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఇష్టం. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఆ రంగు వస్తువులను ఎవరూ కాళ్లకు ధరించకూడదు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక సైన్స్ పరంగా చూస్తే వెండి శరీరానికి చలువ చేస్తుంది. వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ సజావుగా సాగుతూ పాదాల వాపులు రాకుండా ఉంటాయి. అందుకనే మహిళలు తప్పనిసరిగా బంగారు పట్టీలను కాకుండా వెండి పట్టీలనే ధరించాల్సి ఉంటుంది.