విటమిన్ డి అనేది మనకు సూర్యరశ్మి ద్వారా ఎక్కువగా లభిస్తుంది. రోజూ ఉదయం ఎండలో కొంత సేపు గడిపితే మన శరీరం దానంతట అదే విటమిన్ డి ని తయారు చేసుకుంటుంది. అయినప్పటికీ చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో రోజూ విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడాల్సి వస్తోంది. అయితే ఇలా విటమిన్ డి ట్యాబ్లెట్లను రోజుల తరబడి వాడడం మంచిది కాదు. దీంతో శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. దీన్నే విటమిన్ డి టాక్సిసిటీ అంటారు.
విటమిన్ డి టాక్సిసిటీనే హైపర్ విటమినోసిస్ డి అంటారు. అంటే తగిన మోతాదు కన్నా అధికంగా విటమిన్ డిని రోజూ తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. విటమిన్ డి మనకు రోజూ తగిన మోతాదులో ఎంత అవసరమో.. ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది అంత హానిని కలగజేస్తుంది.
మన శరీరంలో కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిలను నియంత్రించేందుకు విటమిన్ డి సహాయ పడుతుంది. విటమిన్ డి లోపిస్తే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎముకలు, కండరాలు బలహీనంగా మారుతాయి. రికెట్స్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. దీన్ని నివారించాలంటే రోజూ మనం తగిన మోతాదులో విటమిన్ డిని తీసుకోవాలి.
ఇక విటమిన్ డి2, డి3 అనేవి మనకు ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తాయి. ఇవి శరీరంలో విటమిన్ డిగా మారుతాయి. విటమిన్ డి2 వృక్ష సంబంధ పదార్థాల ద్వారా మనకు లభిస్తుంది. డి3 మనకు జంతు సంబంధ పదార్థాల ద్వారా వస్తుంది. అలాగే సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అయితే ఎలా లభించినా విటమిన్ డి ని అధిక మోతాదులో తీసుకుంటే శరీరంలో విష పదార్థాలు తయారవుతాయి.
విటమిన్ డి మనకు రోజుకు 600 ఐయూ వరకు అవసరం అవుతుంది. 70 ఏళ్లకు పైబడిన వారికి రోజుకు 800 ఐయూ మోతాదులో విటమిన్ డి కావాలి. ఇంతకన్నా ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
విటమిన్ డి ని తగిన మోతాదులో తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే శరీరంలో అధిక మోతాదులో విటమిన్ డి ఉంటే విటమిన్ కె2 స్థాయిలు తగ్గుతాయి. విటమిన్ కె2 ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. ఈ విటమిన్ స్థాయిలు తగ్గితే ఎముకలు బలహీనంగా మారుతాయి. అందువల్ల విటమిన్ డిని తగిన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.
శరీరంలో విటమిన్ డి టాక్సిసిటీ ఎక్కువైతే వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే శరీరంలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. దీని వల్ల ఆయా లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి అందరిలోనూ కనిపించవు. కేవలం కొందరిలోనే కనిపిస్తాయి.
శరీరంలో విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం స్థాయిలు పెరిగిపోతాయి. దీని వల్ల కణాజాలాలు, చర్మంలో కాల్షియం అధికంగా పేరుకుపోతుంది. ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల హైబీపీ, ఎముకల బలహీనత, కిడ్నీలు దెబ్బ తినడం, అలసట, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అధిక మోతాదులో విటమిన్ డి ని తీసుకోవడం వల్ల కిడ్నీలపై అనవసరంగా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీలు వ్యర్థాలను బయటకు పంపేందుకు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దీని వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుంది.
విటమిన్ డి ని సహజసిద్ధంగా లభించేలా చూసుకుంటే విటమిన్ డి టాక్సిసిటీ ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. శరీరంలో తక్కువ స్థాయిలో విటమిన్ డి ఉంటేనే ట్యాబ్లెట్లను వాడాలి. సాధారణ స్థాయిలో ఉండేవారు ట్యాబ్లెట్లను వాడాల్సిన పనిలేదు. ఇక ట్యాబ్లెట్లను కూడా ఎప్పుడూ వాడరాదు. డాక్టర్లు సూచించిన కాలం పాటు మాత్రమే ట్యాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది. ఇలా విటమిన్ డిని అధికంగా చేరకుండా జాగ్రత్త పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365