Organs : మన శరీరంలో కొన్ని అవయవాలు నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. మన శరీరంలో ఉండే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, మెదడులో కొన్ని భాగాలు, గుండె వంటి అవయవాలు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉంటాయి. ఈ అవయవాలు పని చేయడం ఆగిపోతే మన శరీరంలో జీవ గడియారం ఆగిపోతుంది. అలాగే ఈ అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉంటాము. ఈ అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి విశ్రాంతి అవసరం. మన శరీరంలో నిరంతరం పని చేసే ఈ అవయవాలు పని చేస్తూనే విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉండేలా నిర్మించబడింది. అలాగే ఈ అవయవాలకు ఎంత ఎక్కువగా విశ్రాంతిని అందిస్తే మన అంత ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు జీవించగలుగుతాము.
అవయవాలకు ఎక్కువగా విశ్రాంతిని ఇవ్వడం వల్ల వాటి పనితీరు మెరుగుపడడంతో పాటు వాటి జీవిత కాలం కూడా పెరుగుతుంది. దీంతో మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. మనం సాయంత్రం పూట తేలికగా జీర్ణమయ్యే పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అలాగే వాటిని 6 నుండి 7 గంటల లోపే తీసుకోవాలి. అప్పుడే ఈ అవయవాలకు విశ్రాంతి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను అంతే త్వరగా తీసుకోవడం వల్ల రాత్రంతా పొట్ట ప్రేగులు ఖాళీగా ఉంటాయి. దీంతో ప్రాంకియాస్ గ్రంథికి ఇన్సులిన్ ను ఎక్కువగా విడుదల చేసే అవసరం ఉండదు. మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
కనుక జీర్ణాశయానికి ఎటువంటి శ్రమ ఉండదు. అలాగే కాలేయం పై కూడా ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఆహారం జీర్ణమవుతుంది కనుక పొట్టకు రక్తాన్ని ఎక్కువగా పంపు చేసే అవసరం గుండెకు ఉండదు. అలాగే మనం నిద్రిస్తున్నాం కనుక ఇతర అవయవాలకు కూడా రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేసే అవసరం గుండెకు ఉండదు. దీంతో గుండెకు విశ్రాంతి లభిస్తుంది. పగటి పూట ఎక్కువగా పని చేసే గుండె పొట్ట ప్రేగులు ఖాళీగా ఉండి మనం నిద్రిస్తున్నప్పుడు 55 నుండి 60, 68 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఈ విధంగా గుండె తక్కువగా పని చేస్తూ విశ్రాంతిని తీసుకుంటుంది. అలాగే ఊపిరితిత్తులు కూడా పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆక్సిజన్ ను ఎక్కువగా అందించాల్సి వస్తుంది. మన పొట్ట ప్రేగులు ఖాళీగా ఉండి మనం నిద్రించినప్పుడు ఊపిరితిత్తులపై కూడా ఎక్కువగా ఒత్తిడి పడదు.
ఇలా త్వరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల రాత్రి పూట రక్తప్రసరణ తగ్గుతుంది. కనుక మూత్రపిండాలు కూడా తక్కువగా రక్తాన్ని వడపోస్తాయి. దీంతో వాటిపై ఒత్తిడి తగ్గి విశ్రాంతి లభిస్తుంది. అలాగే మనం త్వరగా తిని నిద్రించడం వల్ల రాత్రి పూట చక్కగా నిద్రపడుతుంది. దీంతో శరీరంలో నియంత్రణ వ్యవస్థ కూడా విశ్రాంతి తీసుకుంటుంది. మన శరీరంలో నిరంతరం పని చేసే ఈ అవయవాలకు ఎంత ఎక్కువగా విశ్రాంతిని ఇస్తే మన ఆరోగ్యం అంత చక్కగా ఉంటుంది. శరీరంలో మలినాలు పేరుకుపోవడం తగ్గుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. మనం సాయంత్రం పూట త్వరగా జీర్ణమయ్యే పండ్లను త్వరగా తినడం వల్ల మాత్రమే ఇది అంతా సాధ్యపడుతుందని నిపుణులు చెబుతున్నారు.