Noodles Cutlet : మనం నూడుల్స్ తో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ నూడుల్స్ ను ఇష్టంగా తింటారు. నూడుల్స్ తో తరచూ చేసే వంటకాలే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే కట్లెట్ లను కూడా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తయారు చేసుకోవడానికి ఈ కట్లెట్స్ చాలా చక్కగా ఉంటాయి. నూడుల్స్ తో రుచిగా, సులభంగా కట్లెట్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నూడుల్స్ కట్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మ్యాగీ – రెండు చిన్న ప్యాకెట్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ తురుము – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, మ్యాగీ మసాలా ప్యాకెట్ – 1, ఉడికించిన బంగాళాదుంపలు – 2, మైదాపిండి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
నూడుల్స్ కట్లెట్ తయారీ విధానం..
ముందుగా ఒక ప్యాకెట్ నూడుల్స్ ను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిని కళాయిలో వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. తరువాత ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, క్యారెట్ తరుము, ఉల్లిపాయ తరుగు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత మ్యాగీ మసాలా వేసి కలపాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా కలుపుకోవాలి.
తరువాత మరో ప్లేట్ లో మరో ప్యాకెట్ నూడుల్స్ ను ముక్కలుగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న నూడుల్స్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కట్లెట్ లా వత్తుకోవాలి. తరువాత దీనిని మైదాపిండి మిశ్రమంలో ముంచాలి. తరువాత ఈ కట్లెట్ ను ముక్కలుగా చేసిన నూడల్స్ లో వేసి చుట్టూ అంటేలా బాగా కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్లెట్ లను వేసి వేయించాలి. వీటిని కొద్దిగా కాలిన తరువాత గంటెతో అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నూడుల్స్ కట్లెట్ తయారవుతుంది.
ఇందులో వేసిన బంగాళాదుంపలను ఉడికించిన తరువాత పొట్టు తీసి ఒక కాటన్ వస్త్రంలో వేసి తడి అంతా పోయే వరకు అలాగే ఉంచాలి. పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే మెత్తగా చేసి వేసుకోవాలి. బంగాళాదుంప మిశ్రమం కట్లెట్ లా చేయడానికి రాకపోతే అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కట్లెట్ విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన రుచికరమైన కట్లెట్ లను టమాట కిచప్ తో కలిపి తినవచ్చు. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.