Eyes : ప్రస్తుత తరుణంలో కంటి సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తున్నాయి. చిన్నతనంలోనే కంటి చూపు మందగిస్తోంది. దీంతో కళ్లద్దాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి పోషకాహార లోపమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. అలాగే పలు ఇతర కారణాల వల్ల కూడా కంటి సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. ఇక కంటి సమస్యలు సాధారణంగా ఎవరికైనా ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఎల్లప్పుడూ కనిపిస్తుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కళ్లు దెబ్బ తినేందుకు అవకాశాలు ఉంటాయి. కొన్ని సార్లు చూపును కూడా కోల్పోతారు. కనుక కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
1. తరచూ కళ్లు నొప్పిగా అనిపిస్తున్నా లేదా తలనొప్పి తరచూ వస్తున్నా.. కంటి సమస్యలు ఉన్నాయేమోనని అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉందని తేలితే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో కళ్లు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లకు ఎలాంటి తీవ్రమైన సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడినవారమవుతాం.
2. కంప్యూటర్ ఎదుట గంటల తరబడి కూర్చున్నా.. లేదా నీళ్లను తక్కువగా తాగినా.. కళ్లు పొడిబారుతుంటాయి. అయితే ఈ రెండు కారణాలు కాకున్నా.. కళ్లు అలాగే పొడిబారుతుంటే.. కళ్లలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు.
3. కొందరికి చీకటి పడుతున్న కొద్దీ కళ్లు సరిగ్గా కనిపించవు. దీన్నే రేచీకటి అంటారు. ఈ సమస్య ఉన్నవారి కళ్లు త్వరగా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. కనుక వీరు వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి.
4. కంటి చూపు అస్పష్టంగా ఉండడం చాలా మందికి జరుగుతుంటుంది. కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలను ఎక్కువ సేపు చూస్తే కళ్లు మసకబారినట్లు కనిపిస్తాయి. చూపు స్పష్టంగా ఉండదు. తరువాత కొంత సేపటికి మళ్లీ బాగానే కనిపిస్తాయి. అయితే ఇలా కాకుండా ఎల్లప్పుడూ కళ్లు మసకగానే కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కళ్లు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.
5. ఇక కొందరికి కళ్లతో ఒక ప్రత్యేక కోణంలో పరిసరాలను చూసినప్పుడు అవి కనిపించవు. ఇలా గనక ఎవరికైనా జరుగుతుంటే వెంటనే డాక్టర్‌ను కలవాల్సిందే. లేదంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
కనుక ఎవరిలో అయినా ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాలి. దీంతో కళ్లను ముందుగానే రక్షించుకున్నవారమవుతాం. కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.