Proteins : మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. ఇవి స్థూల పోషకాల జాబితాకు చెందుతాయి. అంటే వీటిని రోజూ ఎక్కువ పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రోటీన్లను తీసుకోవడం వల్ల మన శరీరంలో అనేక క్రియలు సక్రమంగా నిర్వర్తించబడతాయి. ప్రోటీన్ల వల్ల కండరాల నిర్మాణం జరుగుతుంది. కణజాలాలు మరమ్మత్తులకు గురవుతాయి.
మన శరీరంలో ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు, శక్తి ఉత్పత్తి అయ్యేందుకు, కండరాల పనితీరుకు, గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు.. మనకు ప్రోటీన్లు అవసరం అవుతాయి. అందువల్ల ప్రోటీన్లను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక రోజుకు మనకు ఎంత ప్రోటీన్ అవసరం ఉంటుంది ? అంటే.. ఎవరైనా సరే తమ శరీర బరువులో 1 కిలో బరువుకు సుమారుగా 0.75 గ్రాముల ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. 75 కిలోలు ఉన్న ఒక వ్యక్తి రోజుకు దాదాపుగా 75 x 0.75 = 56.25 గ్రాముల ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరికి వారు తమ శరీర బరువును బట్టి రోజుకు ఎంత మేర ప్రోటీన్లను తీసుకోవాలో సులభంగా లెక్కించుకోవచ్చు.
ఇక ప్రోటీన్లు మనకు ఎక్కువగా చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, ఇతర సముద్రపు ఆహారం, పప్పు దినుసులు, బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, జీడిపప్పు, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, శనగలు, పచ్చి బఠానీలు, పెసలు తదితర ఆహారాల్లో లభిస్తాయి. కనుక వీటిని రోజూ తీసుకుంటుంటే ప్రోటీన్లు సరిగ్గా లభిస్తాయి. దీని వల్ల పైన చెప్పిన ప్రయోజనాలు మనకు ప్రోటీన్ల వల్ల కలుగుతాయి.