Liver Health : మన శరీరంలోని అతి పెద్ద గ్రంథి లివర్. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. జీర్ణక్రియ, వ్యర్థాలను బయటకు పంపడం, పోషకాలను గ్రహించి నిల్వ చేయడం, ఇంకా పలు ఇతర పనులను లివర్ నిర్వర్తిస్తుంది. అయితే మనం పాటించే జీవనవిధానం, పలు ఇతర కారణాల వల్ల కొందరికి లివర్ దెబ్బ తింటుంది. ఈ క్రమంలోనే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని బట్టి మనం మన లివర్ చెడిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇక కొందరికి ఈ సమస్య ప్రారంభంలోనే పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. లివర్ చెడిపోయిన వారికి కామెర్లు వస్తే శరీరం అంతా పసుపు రంగులోకి మారుతుంది. ఇది ప్రధాన లక్షణం. కళ్లు, చర్మం పసుపు రంగులో కనిపిస్తాయి. ఈ విధంగా కనిపిస్తే వెంటనే జాగ్రత్త వహించాలి. డాక్టర్‌ను కలిసి తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి.
2. లివర్ చెడిపోయిన వారిలో పాదాల వాపులు వస్తుంటాయి. తరచూ జ్వరం వస్తుంది. వికారంగా ఉంటుంది. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి వాంతులు అవుతాయి కూడా.
3. లివర్ సమస్య ఉన్నవారిలో చర్మంపై దురదలు వస్తుంటాయి. మూత్రం ముదురు పసుపు రంగులో వస్తుంది.
4. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే కొందరికి పొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది. లివర్ ఉన్న చోట పైన వాపులు కనిపిస్తాయి.
5. లివర్ ఆరోగ్యంగా లేనివారిలో కీళ్లు, కాళ్ల వాపులు వస్తుంటాయి. కాళ్లు దురద పెడుతుంటాయి.
6. లివర్ సమస్య ఉంటే ఆకలి సరిగ్గా కాదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. బరువు తగ్గిపోతారు. చిన్న పని చేసినా తీవ్రమైన అలసట వస్తుంది. గాయాలు తేలిగ్గా అవుతుంటాయి.
7. లివర్ ఆరోగ్యం బాగాలేకపోతే కొందరికి వాంతుల్లో రక్తం కనిపిస్తుంది. మలంలోనూ రక్తం వస్తుంది. నోట్లో దుర్వాసన ఉంటుంది.
8. లివర్ చెడిపోయిన వారు ఎప్పుడూ నిద్ర మత్తులో ఉంటారు. బద్దకంగా అనిపిస్తుంది. ఏ పనిచేయడానికైనా వెనుదీస్తుంటారు. అంతగా ఆసక్తి ఉండదు. కంగారు, ఆందోళన ఉంటాయి.
ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. డాక్టర్‌ను కలిసి లివర్ పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో ముందుగానే లివర్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.