వైద్య విజ్ఞానం

ఇంజెక్ష‌న్ చేసే ముందు వైద్యులు కొంత మెడిసిన్‌ను సిరంజిలోంచి బ‌య‌ట‌కు పంపుతారు… ఎందుకో తెలుసా..?

మీరెప్పుడైనా హాస్పిట‌ల్‌లో ఇంజెక్ష‌న్ చేయించుకున్నారా? అఫ్‌కోర్స్‌..! చేయించుకునే ఉంటారు లెండి. ప్ర‌స్తుత త‌రుణంలో హాస్పిట‌ల్ మెట్ల‌ను తొక్క‌ని వారు బ‌హుశా ఎవ‌రూ ఉండ‌రు. అలాగే ఇంజెక్ష‌న్ చేయించుకోని వారు కూడా ఎవ‌రూ ఉండ‌రు లెండి. అయితే ఇంజెక్ష‌న్ చేసే స‌మ‌యంలో ఓ విష‌యాన్ని మీరు గ‌మ‌నించారా? అదేనండీ, న‌ర్సు లేదా డాక్ట‌ర్ మెడిసిన్‌ను సిరంజిలోకి పూర్తిగా లాగాక‌ దాంట్లో నుంచి కొంత మెడిసిన్‌ను ముందుగా బ‌య‌టికి పంపాకే ఇంజెక్ష‌న్ చేస్తారు క‌దా, వారు అలా చేయ‌డాన్ని మీరెప్పుడైనా చూశారా? చూసే ఉంటారు కానీ, దాని గురించి పెద్ద‌గా ప‌ట్టించుకుని, ఆలోచించి ఉండ‌రు. అయితే వారు అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ఏ హాస్పిట‌ల్‌లోనైనా నర్సు, కాంపౌండ‌ర్‌, డాక్ట‌ర్ ఇలా ఎవ‌రు ఇంజెక్ష‌న్ చేసినా సిరంజిలోని కొంత మెడిసిన్‌ను ముందుగా బ‌య‌టికి పంపుతారు. ఆ త‌రువాతే ఇంజెక్ష‌న్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే… మెడిసిన్‌ను సిరంజిలోకి లాగేట‌ప్పుడు మెడిసిన్‌తోపాటు కొంత గాలి సిరంజి లోప‌లికి వెళ్తుంది. అప్పుడు ఆ సిరంజితో అలాగే ఇంజెక్ష‌న్ చేస్తే అందులో ఉన్న మెడిసిన్‌తోపాటు గాలి కూడా చిన్న చిన్న ఎయిర్ బ‌బుల్స్ రూపంలో రోగి రక్తంలోకి వెళ్తుంది. దీని వ‌ల్ల మెడిసిన్ మొత్తం ఒకే డోస్‌గా రోగికి అంద‌దు. దీంతో రోగి అనారోగ్యం అంత త్వ‌ర‌గా త‌గ్గ‌దు. దీనికి తోడు రోగి ర‌క్తంలో క‌లిసిన గాలి బుడ‌గ‌లు శ‌రీర‌మంత‌టా ర‌క్తం ద్వారా స‌ర‌ఫ‌రా అవుతాయి. ఈ క్రమంలో త‌లెత్తే ప‌రిస్థితిని ఎయిర్ ఎంబోలిజ‌మ్ (Air Embolism) అంటారు. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

why doctors or nurses flick syringe before doing injection

ఎయిర్ ఎంబోలిజ‌మ్ వ‌ల్ల శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. ఒక్కోసారి శ్వాస అవ‌య‌వాలు ప‌నిచేయ‌కుండా పోతాయి. ఛాతిలో నొప్పి వ‌స్తుంది. గుండె ప‌నితీరు దెబ్బ‌తింటుంది. కండ‌రాలు, కీళ్ల నొప్పులు వ‌స్తాయి. ఏకాగ్ర‌త కోల్పోవ‌డం, స్పృహ త‌ప్ప‌డం, తొంద‌రపాటు, ఆందోళ‌న‌, లోబీపీ, చ‌ర్మం నీలం రంగులోకి మార‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ క్ర‌మంలో ఒక్కోసారి ప్రాణం పోయేందుకు అవ‌కాశం కూడా ఉంటుంది. అందుకే సిరంజిలోని మెడిసిన్‌ను ముందుగా కొంత బ‌య‌టికి పంపాకే వైద్యులు ఇంజెక్ష‌న్ చేస్తారు. కాగా సెలైన్ పెట్టే స‌మ‌యంలోనూ వైద్యులు ఇదే విధంగా చేస్తారు. ఇప్పుడ‌ర్థ‌మైందా, ఇంజెక్ష‌న్-సిరంజి-మెడిసిన్ అసలు క‌థ‌!

Admin

Recent Posts