వ్యాస మహర్షి రచించిన గరుడ పురాణం.. అష్టాదశ పురాణాల్లో ఒకటి. దీంట్లో ఎలాంటి పాపాలు చేసిన వారికి ఏయే శిక్షలు నరకంలో విధిస్తారో రాసి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఎవరైనా పాపం చేసి నరకానికి వెళితే యముడు అక్కడ వారికి గరుడ పురాణంలో ఉన్నట్లుగా శిక్షలు విధిస్తాడు. మరి ఏయే పాపాలు చేస్తే నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందామా. ప్రజలను సరిగ్గా పాలించని, వారి సమస్యలను పట్టించుకోని అవినీతి పరులైన రాజకీయ నాయకులను నరకంలో దారుణంగా కొడతారు. తరువాత వారి శరీరాలను రోడ్డు రోలర్ కింద పడేసి నలిపినట్టు నలిపేస్తారు. అనంతరం వారిని పీల్చి పిప్పి చేస్తారు. ప్రజాధనం, వస్తువులను దోపిడీ చేసే వారిని నరకంలో యమభటులు తాళ్లతో కట్టేసి రక్తం వచ్చేట్లు కొడతారు. కింద పడిపోయే వరకు కొట్టడం ఆపరు.
జంతువులను హింసించే వారికి, చంపేవారికి కూడా నరకంలో శిక్షలు పడతాయట. జంతువులను వారు చంపే రీతిలోనే నరకంలోనూ పాపులను యమభటులు అలాగే శిక్షిస్తారట. ఆడ, మగ ఎవరైనా ఒకరినొకరు లైంగికంగా వేధిస్తే అలాంటి వారి జననావయవాలను నరకంలో కత్తిరిస్తారట. మద్యం సేవించే వారికి యమలోకంలో ద్రవ రూపంలో ఉన్న ఇనుమును తాగిస్తారట. పేదలకు ఏమాత్రం సహాయం చేయకుండా, అన్నం పెట్టకుండా తామే తినే వారిని నరకంలో ముక్కలుగా నరికి పక్షులకు ఆహారంగా వేస్తారట. జంతువులను తమ సంతోషం కోసం హింసించే వారిని నరకంలో యమభటులు సలసల కాగే నూనెలో వేయిస్తారట.
ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేసేవారిని, అబద్దాలు ఆడే వారిని, ఇతరులను దూషించే వారిని నరకంలో తలకిందులుగా వేలాడదీసి జంతువులచే హింసింపజేస్తారట. అధికారాన్ని దుర్వినియోగం చేసే వారిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేసే వారిని నరకంలో మానవుల వ్యర్థాలతో ఉన్న నదిలో పారేస్తారట. అలాగే ఆ మలాన్ని వారిచే యమభటులు తాగిస్తారట. ఇతరులకు సహాయం చేయని వారిని నరకంలో ఎత్తైన లోయ నుంచి కిందకు విసిరేస్తారట. పాములు, తేళ్లు వంటి విష పురుగులతో వారిని యమభటులు కుట్టిస్తారట. తరువాత క్రూర జంతువులతో హింసిస్తారట. పెద్దలకు గౌరవం ఇవ్వని వారిని, దేశ భక్తి కలిగి ఉండని వారిని నరకంలో వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచుతారట.