Aku Kura Vada : మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే చాలా మంది ఆకుకూరలను తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు అస్సలు వీటిని తినరు. అలాంటి పిల్లలకు ఆకుకూరలతో వడలు తయారు చేసి పెట్టవచ్చు. ఆకుకూరలతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటి తయారీలో ఏ ఆకుకూరనైనా వేసుకోవచ్చు. ఈ వడలను తయారు చేయడం చాలా సులభం. ఆకుకూరలను తినని పిల్లలు కూడా ఈ వడలను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలతో రుచిగా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూర వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
4 నుండి 6 గంటల పాటు నానబెట్టిన మినపప్పు – ఒక కప్పు, జీలకర్ర – 2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి మరియు అల్లం పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పాలకూర – పావు కప్పు, తరిగిన తోటకూర – అర కప్పు, ఉప్పు – తగినంత, తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆకుకూర వడ తయారీ విధానం..
ముందుగా మినపప్పును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఆకుకూరలతో పాటు గా మిగిలిన పదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద కళాయిని ఉంచి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతికి తడి చేసుకుంటూ పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆకుకూర వడలు తయారవుతాయి. వీటిని చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా వడలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.