All In One Chutney : ఆల్ ఇన్ వన్ చట్నీ.. ఎండుమిర్చితో చేసే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒకసారి తయారు చేసుకుని ఆరు నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. మనం చేసే అనేక రకాల చిరుతిళ్లల్లో దీనిని వాడుకోవచ్చు. నూడుల్స్, మంచురియా, పిజ్జా, పాస్తా వంటి అనేక వంటకాల్లో దీనిని వేసుకోవచ్చు. అలాగే అన్నం, అల్పాహారాలతో కూడా ఈ చట్నీని తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎండుమిర్చితో ఎంతో రుచిగా ఉండే ఆల్ ఇన్ వన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆల్ ఇన్ వన్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 10 నుండి 15, నూనె – 1/3 కప్పు, అనాస పువ్వులు – 2, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు – అరకప్పు, చిన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – పావు కప్పు, నీళ్లు – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పంచదార – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్, డార్క్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – పావు కప్పు.
ఆల్ ఇన్ వన్ చట్నీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో ఎండుమిర్చిని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత వేడి నీటిని పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ ఎండుమిర్చిని నీటితో సహా జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అనాస పువ్వులు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని ఎండుమిర్చి పేస్ట్ లో కలపాలి. ఇందులోనే మిరియాల పొడి, ఉప్పు, పంచదార వేసి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత వెనిగర్, చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట కిచప్ వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆల్ ఇన్ వన్ చట్నీ తయారవుతుంది. ఇలా చాలా సులభంగా రుచికరమైన చట్నీని తయారు చేసుకుని అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు.